New Delhi, JAN 23: గతేడాది చివరలో చైనా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభమైన జనవరి నుంచి వైరస్ వ్యాప్తి తగ్గుతూ వచ్చింది. వైరస్ నుంచి బయటపడ్డామనే లోగానే.. మరో వైరస్ వ్యాప్తి చెందుతున్నది. అనేక దేశాల్లో హెచ్5ఎన్1 (H5N1) కేసులు పెరుగుతున్నాయని భయాందోళనలు నెలకొంటున్నాయి. హెచ్‌ఎంపీవీతో ప్రపంచం వైరస్ గురించి ఆందోళనపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా నివేదికలను గమనిస్తే.. హెచ్5ఎన్1 వైరస్ జాతుల్లో తొమ్మిది కంటే ఎక్కువ ఉత్పరివర్తనాలను శాస్త్రవేత్తలు గురించినట్లు సమాచారం. కొత్త వేరియంట్లు వైరస్ వ్యాప్తి వేయడంతో పాటు కొత్త సమస్యలను పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బర్డ్‌ఫ్లూ కారణంగా అమెరికాలో ఈ నెలలో తొలి మరణం నమోదైన విషయం తెలిసిందే. బర్డ్‌ఫ్లూ, ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా పేరుతో హెచ్5ఎన్1 వైరస్‌ను పిలుస్తుంటారు. అయితే, సాధారణంగా ఇది పక్షులు, జంతువుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మనుషులకు చాలా అరుదుగా సోకుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వైరస్ కోళ్లు, పక్షులతో పాటు ఆవులు సహా ఇతర జంతువులకు సైతం సోకడం ఆందోళన కలిగిస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ వైరస్ మనుషుల్లోనూ వ్యాప్తి చెందుతున్నది. కానీ, మరణాల రేటు తక్కువగా ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్‌లో బర్డ్ ఫ్లూ కేసులు పెరిగాయి. జార్జియాలోనూ అనేక కోళ్ల ఫామ్‌లలో వైరస్‌ను గుర్తించారు. జార్జియా వ్యవసాయశాఖ దీనిపై సమాచారం అందించింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అమెరికాలోనూ అనేక ప్రాంతాల్లో హెచ్5ఎన్1 కొత్త వేరియంట్లు గుర్తించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ కారణంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. కొందరు నిపుణులు కొవిడ్ కంటే వంద రెట్లు ఎక్కువ వేగంగా సోకుతుందని.. ప్రమాదకరమైందని పేర్కొంటున్నారు. ఇటీవల బర్డ్‌ఫ్లూ కొత్త ఉత్పరివర్తనాలపై ఓ బ్రీఫింగ్‌లో నిపుణులు.. ఆందోళన వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. వైరస్ ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధి విస్తరించే స్థాయికి చేరుతుందన్నారు. పిట్స్‌బర్గ్‌లోని ప్రముఖ బర్డ్ ఫ్లూ నిపుణుడు డాక్టర్ సురేష్ కూచిపూడి మాట్లాడుతూ హెచ్5ఎన్1 ప్రస్తుతం మనుషుల్లోనూ ప్రమాదం పెంచుతుందన్నారు.
టెక్సాస్ బయోమెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బర్డ్ ఫ్లూ సంక్రమణ ప్రమాదం, కారణాలపై పరిశోధనలు నిర్వహించారు. గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ ఉద్భవిస్తుందని.. ఇది ఆందోళనకరమైన విషయంగా పరిశోధకుల బృందం పేర్కొంది. ఎలుకలపై నిర్వహించిన అధ్యయనం తర్వాత.. వైరస్‌లోని వేరియంట్లు మానవ కణాల్లోనూ వేగంగా పెరుగుతాయని గుర్తించారు. గత కొన్ని నెలల్లో పశువులు, పచ్చి పాలలో వైరస్‌ను గుర్తించడం అందరినీ షాక్‌కు గురి చేస్తున్నది. ఇటీవల నెలల్లో అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉన్న పశువుల్లో బర్డ్ ఫ్లూ (H5N1) వైరస్ గుర్తించి.. హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వైరస్‌ను ఆవుల్లో గుర్తించడం ఇదే తొలిసారని సీడీసీ సైతం పేర్కొంది. వైరస్ ఆవు నుంచి మనుషులకు సైతం వ్యాపించిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గతేడాది జూన్‌లో భారత్‌లో బర్డ్‌ఫ్లూ కేసులు పెరిగాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. లుగు రాష్ట్రాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వైరస్ పభావిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ (నెల్లూరు జిల్లా), మహారాష్ట్ర (నాగ్‌పూర్ జిల్లా), జార్ఖండ్ (రాంచీ జిల్లా), కేరళ (అలప్పుళ, కొట్టాయం, పతనంతిట్ట జిల్లాలు) ఉన్నాయి. కోళ్లు, పక్షుల్లో అసాధారణ మరణాలపై దృష్టి పెట్టాలని సూచించింది.