COVID19 in India: భారత్‌లో మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి, కొత్తగా 46,164 కోవిడ్ కేసులు మరియు 607 మరణాలు నమోదు; ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 31 వేలకు పైగా కేసులు నిర్ధారణ
గడిచిన 24 గంటల్లో 31,445 కేసులు 215మరణాలు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా కేరళలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది...
New Delhi, August 26: భారత్‌లో కోవిడ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. ఈ వారం ప్రారంభంలో సోమ, మంగళ వారాల్లో 25 వేల అడుగుకు పడిపోయిన రోజూవారీ కోవిడ్ కేసులు, బుధవారం 35 వేలకు చేరాయి, ఇక గురువారం వచ్చేసరికి ఏకంగా 46 వేల మార్కును దాటి సుమారు 2 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కొత్త కేసులలో సగానికంటే ఎక్కువ కేరళ రాష్ట్రం నుంచి ఉండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 31,445 కేసులు 215మరణాలు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా కేరళలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
భారతదేశంలో కోవిడ్ మహమ్మారి పాండెమిక్ దశ నుంచి ఎండెమిక్ దశలో ప్రవేశిస్తుండవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. అంటే దేశంలో ఎక్కడో ఒకచోట స్వల్ప లేదా మధ్యస్థ స్థాయిలో వ్యాప్తి అనేది జరుగుతోంది. దీని ప్రకారం కరోనా భారతదేశంలో ఎప్పటికీ ఉంటుంది. ఇక్కడ జనాభా వైరస్‌తో పాటే జీవించడం నేర్చుకునే దశకు చేరుకుంటుందని తెలిపారు.
గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 46,164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 607 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,36,365 కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 34,159 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,17,88,440 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,87,987 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.63% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.03 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.34% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India's COVID Status Update:
ఆగష్టు 25 నాటికి దేశవ్యాప్తంగా 51,31,29,378కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 17,87,283 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 80,40,407 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 60.38కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 60,38,46,475 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 46.68 కోట్లు ఉండగా, 13.69 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.