Coronavirus in India: పుట్టినరోజే కరోనాతో ఎమ్మెల్యే మృతి, కోవిడ్-19 కేసుల్లో వూహాన్ నగరాన్ని మించిపోయిన ముంబై, దేశ వ్యాప్తంగా 2 లక్షల 75 వేలు దాటిన కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,985 కేసులు నమోదు కాగా, 279 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,76,583కి చేరగా.. మృతుల సంఖ్య (Coronavirus Deaths) 7,745కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,33,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 1,45,216 మందికి కరోనా టెస్టులు చేశారు.

Coronavirus Outbreak in China (Photo Credits: IANS)

Mumbai, June 10: దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య (Coronavirus in India) రోజులు గడుస్తున్న కొద్దీ వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,985 కేసులు నమోదు కాగా, 279 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,76,583కి చేరగా.. మృతుల సంఖ్య (Coronavirus Deaths) 7,745కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,33,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 1,45,216 మందికి కరోనా టెస్టులు చేశారు. ముప్పు మరింతగా పెరుగుతోంది, కోవిడ్-19 వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ, నిర్లక్ష్యమే పెను ప్రమాదంగా మారిందని తెలిపిన సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌

దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 50,61,332గా నమోదైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు (COVID-19 Pandemic) నిర్ధారణ అయ్యాయి. భారత్‌లో యాక్టివ్‌గా ఉన్న కేసుల కన్నా.. రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 48.9 శాతంగా ఉన్నట్లుగా ప్రభుత్వం పేర్కొన్నది.

తమిళనాడును కమ్మేసిన కోవిడ్-19 మహమ్మారి డీఎంకే ఎమ్మెల్యేను బలితీసుకుంది. చేప్పాక్కం ఎమ్మెల్యే అన్బగళన్ (62) (Anbazhagan) ఈ ఉదయం కరోనాతో కన్నుమూశారు. దివంగత కరుణానిధి, డీఎంకే చీఫ్ స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడైన అన్బగళన్ 2001, 2011, 2016లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సినీ పరిశ్రమతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగానూ వ్యవహరించారు.

Here's ANI Tweet

నటుడు జయం రవితో ‘ఆదిభగవాన్’ అనే సినిమా నిర్మించారు. కరోనాతో ఓ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోవడం దేశంలో ఇదే తొలిసారి. నేడు ఆయన పుట్టిన రోజు. బర్త్‌డే నాడే ఆయన కరోనాతో కన్నుమూయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, అన్బుగళన్ మృతికి ముఖ్యమంత్రి పళనిస్వామి, స్టాలిన్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నేతలు సంతాపం తెలిపారు.

ప్రాణాంతక కరోనా వైరస్‌ ‌విజృంభణతో దేశ అర్థిక రాజధాని ముంబై వైరస్‌ పురుడుపోసుకున్న చైనాలోని వూహాన్‌ నగరాన్ని అధిగమించింది. వూహాన్‌లో మొత్తం 50,333, కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 3,869 మంది మృత్యువాత పడ్డారు. తాజా గణాంకాల ప్రకారం ముంబైలో 51,000 కేసులు నిర్ధారణ కాగా, 1,760 మరణించారు. దీంతో ప్రపంచ హాట్‌స్పాట్‌గా నిలిచిన వూహాన్‌ను మించి ముంబైలో కరోనా విభృంభిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే అక్కడితో పోల్చుకుంటే ముంబైలో మరణాల సంఖ్య కొంత తక్కువగా ఉంటడం ఊరటనిస్తోంది

రోజులు గడుస్తున్నా కొద్ది దేశంలో వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. గత వారం వరకు రోజుకూ ఏడువేల చొప్పున నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య తాజాగా పదివేలకు చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక నాలుగో విడత లాక్‌డౌన్‌ అనంతరం ఇచ్చిన సడలింపులతో వైరస్‌ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ఈ క్రమంలోనే జూలై నాటికి దేశ రాజధాని ఢిల్లీ 5లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావచ్చన్న అధికారుల అంచనా ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపట్టనుంది.

గత 40 రోజుల్లో దాదాపు 86 శాతం కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని హిందుస్తాన్ టైమ్స్ తెలిపింది. అలానే మే, జూన్ మధ్య 84 శాతం మంది రోగులు మరణించినట్లు పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించినంతవరకు మే నెల భారతదేశంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. తాజా పరిశీలన ప్రకారం ఒక్క మే నెలలోనే 1,53,000 కేసులు నమోదయ్యాయి. జూన్ 1 నుంచి దేశంలో ఆంక్షలను తగ్గించడమే కాక, ఆర్థిక కార్యకలాపాలను పునః ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడిచిన తొమ్మిది రోజుల్లో దేశంలో 76,000 కన్నా ఎక్కువ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని తెలిపింది.

కరోనా కేసుల సంఖ్యలో భారత్‌.. అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే తరువాత ఐదవ స్థానంలో నిలిచిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌ గత డిసెంబరులో చైనాలో ఉద్భవించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 71.5 లక్షల మందికి పైగా వైరస్‌ బారిన పడగా.. 4 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు.