COVID in India: గత 24 గంటల్లో 341 కొత్త కేసులు, కరోనాతో ముగ్గురు మృతి, 3 నెలలకోసారి ఆసుపత్రుల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క కేరళలోనే 292 కేసులు నమోదైనట్లు తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,041 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి

COVID-19 representational image (Photo Credit- IANS)

New Delhi, Dec 20: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 341 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క కేరళలోనే 292 కేసులు నమోదైనట్లు తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,041 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.కొత్తగా వెలుగుచూసిన కొవిడ్-19 ఉపరకం జేఎన్‌-1 (COVID subvariant JN.1) పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించిన విషయం తెలిసిందే.

అయితే, ఈ వేరియంట్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. జేఎన్‌-1 అనేది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని ప్రకటించింది. దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా వర్గీకరించింది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్‌.1తోపాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని పేర్కొంది.

తెలంగాణలో కరోనా కలకలం.. కొత్తగా నాలుగు కేసులు నమోదు.. ఆరు నెలల తర్వాత కొవిడ్ బులెటిన్ విడుదల

జేఎన్‌.1 సబ్‌ వేరియంట్‌ (JN.1 variant) కారణంగా దేశంలో కొవిడ్‌ (Covid) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, ఆసుపత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ (Mansukh Mandaviya) బుధవారం రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కీలక సూచనలు చేశారు. ప్రతి మూడు నెలలకోసారి ఆసుపత్రుల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని సూచించారు.

మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన సమయమిది. మళ్లీ కొవిడ్‌ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రుల సన్నద్ధత, వైరస్‌ వ్యాప్తిని నిరోధించడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై మనం సిద్ధంగా ఉండాలి. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలి. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది’’ అని కేంద్రమంత్రి మాండవీయ తెలిపారు. పండగ సీజన్‌తో పాటు చలి కాలం నేపథ్యంలో వైరస్‌ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు.