COVID in India: దేశంలో కరోనా విలయం, ఒక్కరోజులోనే అత్యధికంగా 38,902 పాజిటివ్ కేసులు నమోదు, భారత్‌లో 10,77,618కు చేరిన కొవిడ్ బాధితుల సంఖ్య
ఇప్పటివరకు 677,423 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 3,73,379 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది....
New Delhi, July 19: భారతదేశంలో కరోనావైరస్ ఉధృతి అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఒకరోజులో నమోదవుతున్న అత్యధిక పాజిటివ్ కేసులతో ప్రపంచంలోనే అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలోకి వచ్చి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 38,902 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 10,77,618 కు చేరింది. నిన్న ఒక్కరోజే 543 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 26,816 కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23,672 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 677,423 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 3,73,379 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India's COVID19 Tracker:
కొవిడ్ కారణంగా మహారాష్ట్ర దేశంలోనే అత్యంత ప్రభావం చెందిన రాష్ట్రంగా అవతరించింది. ఈ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే మూడు లక్షల మార్కును దాటగా, రాజధాని అయిన ఒక్క ముంబై నగరంలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 1 లక్ష దాటింది.
మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, దిల్లీలో కూడా కేసుల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, దిల్లీలో రోజురోజుకు వచ్చే పాజిటివ్ కేసులతో పోల్చితేఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూపోతుంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా గల గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటికే 14 మిలియన్లకు పైగా ప్రజలు కరోనావైరస్ బారిన పడగా, 602,656 మంది ప్రాణాలు కోల్పోయారు. జూలై 13న 13 మిలియన్లుగా ఉన్న గ్లోబల్ పాజిటివ్ కేసుల సంఖ్య కేవలం నాలుగు రోజుల్లోనే మరో 10 లక్షలకు పెరిగి 14 మిలియన్లకు చేరింది.