India Covid Report: కరోనా వ్యాక్సిన్‌పై గుడ్ న్యూస్, జనవరిలో వాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపిన సీరం, దేశంలో తాజాగా 50,210 మందికి కోవిడ్-19 పాజిటివ్
దేశంలో ఇప్పటి వరకు 83,64,086 కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 tally) నమోదయ్యాయి. కేసుల తీవ్రత పెరుగుతున్నా డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది.
New Delhi, November 5: భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 50,210 కరోనా పాజిటివ్ కేసులు (India Covid Report) నమోదు కాగా, 704 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 83,64,086 కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 tally) నమోదయ్యాయి. కేసుల తీవ్రత పెరుగుతున్నా డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 55,331మంది డిశార్జ్ కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5,33,787 యాక్టీవ్ కేసులున్నాయి. ఇక మొత్తం ఇప్పటి వరకు 76,11,809 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఇక కరోనా వైరస్ సోకి దేశంలో ఇప్పటి వరకు మొత్తం1,24,315మంది మృతి (Corona Deaths) చెందారు. మరోవైపు కరోనా రికవరీ రేటు కూడా చాలా ఎక్కువగానే ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 92.20 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన కేసులలో మొత్తం యాక్టివ్ కేసులు కేవలం 6.318 శాతం మాత్రమే. ఈ మరణాల శాతం మొత్తం నమోదయిన కేసులలో 1.49 శాతంగా ఉన్నాయి.
కోవిడ్-19 వ్యాక్సిన్‌పై సీరం ఇన్‌స్టిట్యూట్ కీలక విషయాన్ని ప్రకటించింది. 2021 జనవరి నాటికి తమవాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, బ్రిటీష్ సంస్థ ఆశ్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ 2021, జనవరి నాటికి భారత్‌లో లభిస్తుందని పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా తాజాగా వెల్లడిచారు. ట్రయల్స్ విజయవంతమైన అనంతరం నియంత్రణ సంస్థల ఆమోదాలు సకాలంలో లభిస్తే వచ్చే ఏడాది జనవరి నాటికి టీకా భారత్‌లో లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
భారత్, యూకేలలో జరుగుతున్న పరీక్షల ఆధారంగా ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా ఉంటుందనే నమ్మకముందని పేర్కొన్నారు. భారత మార్కెట్ కోసం కొవీషీల్డ్ పేరుతో వస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం దేశంలో రెండు, మూడు దశల పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫలితాలు వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్ గురించి ప్రస్తావించిన అదర్ పూనావాలా కొవీషీల్డ్‌కు సంబంధించి తక్షణం ఆందోళన కలిగించే అంశాలేమీ లేవని, భారత్‌తో పాటు విదేశాల్లో వేలాది మంది ఈ వ్యాక్సిన్ షాట్ లభించిందని ఆయన తెలిపారు.
ఇప్పటివరకైతే తమ సంస్థ 60 నుంచి 70 లక్షల మోతాదుల తయారీ లక్ష్యంగా ఉన్నట్టు, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక నెలకు కోటి మోతాదుల వ్యాక్సిన్‌లను తయారు చేయాలని భావిస్తున్నట్టు ఆయన వివరించారు. అంతేకాదు టీకా సరసమైన ధరకు టీకాను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వంతో సీరం చర్చలు జరుపుతోందన్నారు. అందరికీ అందుబాటులో ధరలో టీకాను అందించాలని నిశ్చయించుకున్నామని పూనావాలా ప్రకటించారు.