Coronavirus in India: నేటి నుంచి జనవరి 5 వరకు నైట్ కర్ఫ్యూ, కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం, ఇండియా నుంచి యూకేకి విమానాల సర్వీసు రద్దు, దేశంలో తాజాగా 19,556 మందికి కరోనా

కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 30,376 మంది కోలుకున్నారు.

COVID-19 lockdown in India | (Photo Credits: IANS)

New Delhi, December 22: దేశంలో గత 24 గంటల్లో 19,556 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ (Coronavirus in India) అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 30,376 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,75,116కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 301 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,46,111కు (Coronavirus Deaths) పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 96,36,487 మంది కోలుకున్నారు. 2,92,518 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

యూకేలో బయటకు వచ్చిన కొత్తరకం కరోనా వైరస్‌తో (new strain of coronavirus) మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముంబైతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కర్ఫ్యూ (Night Curfew) ఉంటుందని ప్రకటించింది. నేటి నుంచి జనవరి 5వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. అదేవిధంగా యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు 14రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేసింది.

లాక్‌డౌన్ 4 వచ్చేసింది, డేంజర్ జోన్ లోకి బ్రిటన్, కొత్త రూపంతో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా, యూకేకు అంతర్జాతీయ రాకపోకలను నిషేధించిన పలు దేశాలు, ఆందోళన వద్దు అప్రమత్తంగా ఉన్నామని తెలిపిన భారత్

వారికి ఐదు లేదా ఏడవరోజు కరోనా పరీక్షలు నిర్వహించి, నెగిటివ్‌ అని తేలితేనే రాష్ట్రంలోకి అనుమతించనుంది. కరోనా ప్రభావంతో ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్టాల కంటే ముందుగానే ఆంక్షలు విధించింది. కోవిడ్‌ వ్యాప్తి నివారణకు సిఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదని, ప్రజలం‍దరూ కోవిడ​ నిబంధనలు తప్పకుండా అనుసరించాలని సీఎం ఉద్ధవ్ కోరారు. మాస్కులు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇవేం కొత్త రోగాలు..కేరళను వణికిస్తున్న షిగెల్లా వ్యాధి, బాలుడు మృతి..పెరుగుతున్న కేసుల సంఖ్య, షిగెల్లా లక్షణాలు ఎలా ఉంటాయో ఓ సారి తెలుసుకోండి

యూకేలో బయటపడ్డ కొత్తరకం వైరస్‌తో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా యూకే నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధాన్ని విధిస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ, ఆస్ట్రియా, హాంకాంగ్, సౌదీ అరేబియాలు యూకేకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. మనదేశంలోనూ రేపు అర్థరాత్రి నుంచి డిసెంబర్‌ 31 వరకు యూకేకు నడిచే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.