International Yoga Day: యోగా డే కోసం త్రివిధ దళాలు భారీ ఏర్పాట్లు, ఐఎన్‌ఎస్ విక్రాంత్ సహా 360 డిగ్రీల కోణంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ యుద్ద నౌకలో యోగా దినోత్సవానికి ప్రత్యేక అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. 360 డిగ్రీల కోణంలో యోగా దినోత్సవం జరిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది భారత నౌకాదళం.
New Delhi, Jue 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) ఘనంగా జరిపేందుకు త్రివిధ దళాలు భారీ ఏర్పాట్లు చేశాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ యుద్ద నౌకలో యోగా దినోత్సవానికి ప్రత్యేక అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. 360 డిగ్రీల కోణంలో యోగా దినోత్సవం జరిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది భారత నౌకాదళం. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకటే భవిష్యత్తు నినాదంతో (Vasudhaiva Kutumbakam) యోగా దినోత్సవం జరుపుతున్నట్లు ప్రకటించింది. 19 యుద్ద నౌకలు, 3వేల 500 మంది సిబ్బంది, 35 వేల కిలోమీటర్లతో యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చేసింది నౌకాదళం. 11 అంతర్జాతీయ పోర్టులు, అంతర్జాతీయ సరిహద్దుల్లో యోగా చేయనున్నారు నౌకాదళ సిబ్బంది. బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండొనేషియా, కెన్యా, మడగాస్కర్, ఒమన్, శ్రీలంక, థాయ్‌లాండ్, దుబాయ్ వంటి దేశాల హార్బర్లలో భారత నౌకాదళం యోగాసనాలు ప్రదర్శించనుంది. కిల్టన్, చెన్నై, షివాలిక్, సునయన, త్రిషూల్, తార్‌కష్, వాగిర్, సుమిత్ర, బ్రహ్మపుత్ర యుద్ద నౌకల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇక, 106 ప్రదేశాల్లో భారత్ మాల (Bharat Mala) ఆకృతిలో యోగా చేయాలని ఆర్మీ నిర్ణయించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సియాచిన్ మొదలు.. కన్యాకుమారి, అండమాన్ నికోబార్ వరకయోగాసనాలు చేయనున్నారు సైనిక సిబ్బంది. సైనిక సిబ్బందితో పాటు.. యోగా (International Yoga Day) కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఇప్పటికే వివిధ దేశాలతో జరిగే కార్యక్రమాల్లో హజరయ్యేందుకు ఆయా దేశాలకు వెళ్లిన సిబ్బంది కూడా స్థానిక సైనిక సిబ్బందితో కలిసి యోగా చేయనున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
ఇండో, ఆఫ్రికా స్నేహ పూర్వక సిబ్బంది, ఐక్యరాజ్యసమితి ఆపరేషన్లలో ఉన్న సిబ్బంది ఆ కంటింజెంట్‌లతో కలిసి యోగా నిర్వహిస్తారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ కంటోన్ మెంట్‌లో జరిగే యోగా కార్యక్రమానికి ఆర్మీ ఛీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి యోగా కార్యక్రమానికి పలు దేశాల ఆర్మీ సిబ్బంది కూడా హజరవుతారు. పలు రాష్ట్రాల్లో యోగా కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.