Israel Issued Advisory: ఢిల్లీలో ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు, భారత్ లోని ఇజ్రాయిల్ పౌరులను అలర్ట్ చేసిన ఇజ్రాయిల్ ప్రభుత్వం
ఎంబసీ వద్ద పేలుడును ఉగ్రవాద దాడిగా ఇజ్రాయెల్ అభివర్ణించింది. జ్యూయిస్ పౌరులు (Jewish Israeli Citizens) మాల్స్, మార్కెట్లు తదితర రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించింది.
New Delhi, DEC 27: దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం (Embassy)సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు (Blast) సంభవించింది. చాణక్యపురిలోని ఎంబసీ వద్ద 5.48 గంటలకు పేలుడు జరిగిందని ఎంబసీ ప్రతినిధి గై నిర్ తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి భారత్‌లోని తమ పౌరులకు అడ్వైజరీని (Israel Issued Advisory) జారీ చేసింది. ఎంబసీ వద్ద పేలుడును ఉగ్రవాద దాడిగా ఇజ్రాయెల్ అభివర్ణించింది. జ్యూయిస్ పౌరులు (Jewish Israeli Citizens) మాల్స్, మార్కెట్లు తదితర రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించింది. రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్బులు, బహిరంగ ప్రదేశాలతో పాటు అన్నిచోట్లా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గుంపులుగా ఎక్కడికీ వెళ్లవద్దని.. ఎక్కడికి వెళ్లినా తమ ఐడెంటినీ సాధారణ వ్యక్తులకు చెప్పొద్దని సూచించింది. సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేయొద్దని చెప్పింది.
ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం రాయబార కార్యాలయం వెనుకాల పేలుడు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందిందని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్ ఎంబసీ సెక్యూరిటీ గార్డు సమాచారం అందించాడని, వంద మీటర్ల దూరంలో ఉన్న సమయంలో పేలుడు శబ్దం వినిపించిందని పేర్కొన్నారు.
ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు, స్పెషల్ పార్టీ, ఫైర్ సర్వీసెస్, సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సంఘటనా స్థలం మంటలు, పేలుడు జరిగినట్లుగా ఎలాంటి క్లూలు లేవని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఘటనా స్థలంలో బాంబు డిటెక్షన్ డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లను మోహరించారు. అయితే, 2021 జనవరిలో ఎంబసీ వద్ద స్వల్ప తీవ్రతతో బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుడుపై ఎన్‌ఐఏ ఇంకా విచారణ జరుపుతున్నాయి. ఇటీవల మళ్లీ ఎంబసీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఎంబసీ వద్ద భద్రతను పెంచారు.