YS Family's Property Dispute: ఆడబిడ్డ కన్నీరు జగన్ ఇంటికి అరిష్టం, వైఎస్ కుటుంబం ఆస్తుల వివాదంపై స్పందించిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి
వైఎస్ కుటుంబం ఆస్తుల కోసం తగదాలు పడటం బాధాకరమని అన్నారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, ఆయన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తాజాగా స్పందించారు. వైఎస్ కుటుంబం ఆస్తుల కోసం తగదాలు పడటం బాధాకరమని అన్నారు. ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టమని పేర్కొన్నారు.
ఈ సమస్య పరిష్కారం కోసం వైఎస్ విజయమ్మ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. వేరే వాళ్లు దీనిలో జోక్యం చేసుకోవద్దని బాలినేని కోరారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. తాను ఏ పార్టీలో ఉన్నా వైఎస్ కుటుంబం బాగుండాలని కోరుకుంటానని చెప్పారు.
ఆస్తులు సంపాదించుకుని పార్టీ మారినట్టు తనపై కొందరు వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. వైసీపీలో ఉన్నప్పుడు తన ఆస్తులు పోగొట్టుకున్నాను తప్పితే, సంపాదించుకోలేదని తన కుమారుడి సాక్షిగా చెప్పారు. తన తండ్రి, కోడలి ఆస్తి అమ్మి తాను చేసిన అప్పులను తీర్చినట్టు తెలిపారు. ఈ విషయం జగన్‌కు కూడా తెలుసని పేర్కొన్నారు.
Balineni on YS Family's Property Dispute
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసినప్పుడు ఎన్నికలకు ముందే పార్టీలోకి తీసుకుందామనుకున్నట్టు చెప్పారని గుర్తు చేశారు. కానీ జగన్‌కు బంధువు కావడంతో అడగలేకపోయానని పవన్ తనతో చెప్పినట్లు బాలినేని తెలిపారు. ఆయన హుందాగా మాట్లాడటం తనకు నచ్చిందన్నారు. ఇక మంత్రి పదవి వదులుకుని జగన్ వెంట నడిస్తే.. ఆ పార్టీలో తనకు ఏం జరిగిందో ప్రజలకు తెలుసునని బాలినేని పేర్కొన్నారు.