Jahangirpuri Violence Case: ఢిల్లీ జహంగీర్‌పురిలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తం, పోలీసులపై రాళ్ల దాడి, 23 మందిని అరెస్ట్, పరిస్థితి అదుపులో ఉందని తెలిపిన ఢిల్లీ పోలీస్ కమీషనర్ రాకేశ్ ఆస్థానా
నిందితుల్లో ఒకరి ఇంటికి చెందిన మహిళను పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లే క్రమంలో సోమవారం మళ్లీ ఘర్షణ వాతావరణం (Jahangirpuri Violence Case) నెలకొంది.
New Delhi, April 18: దేశ రాజధాని ఢిల్లీ జహంగీర్‌పురిలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిందితుల్లో ఒకరి ఇంటికి చెందిన మహిళను పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లే క్రమంలో సోమవారం మళ్లీ ఘర్షణ వాతావరణం (Jahangirpuri Violence Case) నెలకొంది. హనుమాన్ జయంతి రోజున ఢిల్లీలోని జహంగిర్‌పుర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ హింస కేసులో ఢిల్లీ పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. వీరిలో 8 మందికి నేర చరిత్ర ఉంది. దోషిగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని ('Every Aspect Will Be Covered) ఢిల్లీ సీపీ రాకేశ్ ఆస్తానా తెలిపారు.
తాజాగా నిందితుల్లో ఒకడైన సోనూ భార్యను పోలీసులు ఇంటరాగేషన్ పేరిట అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తరలిస్తున్న క్రమంలో.. యాభై మంది మహిళలను పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు జోక్యం చేసుకుని పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అప్రమత్తమైన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ 16వ తేదీన జహంగిర్‌పుర్‌లో ఓ వ్యక్తి కాల్పులు జరుపుతున్న వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోతో లింకున్న వ్యక్తిని ప్రశ్నించేందుకు సీడీ పార్క్‌లో ఉన్న అతనికి ఇంటికి వెళ్లారు. ఆ వ్యక్తి కుటుంబసభ్యులు పోలీసులపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
సోనూ చిక్నా అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, ఒకర్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జహంగిర్‌పురిలో పరిస్థితి అదుపులో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. 14 బృందాలుగా పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నట్లు డీసీపీ చెప్పారు. సోషల్ మీడియా ద్వారా శాంతికి భంగం కలిస్తున్న వారిపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. అరెస్టు అయిన వారి నుంచి అయిదు గన్నులు, అయిదు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అస్లమ్ అనే వ్యక్తి నుంచి దేశీయ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కరోనా మృతులు 5 లక్షలు కాదు, 40 లక్షలు, కరోనా మృతులపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
హనుమాన్ జయంతి ఊరేగింపు సమయంలో మసీదు వద్ద కాషాయ జెండాను ఎగురవేసేందుకు ఎటువంటి ప్రయత్నం జరగలేదని ఢిల్లీ పోలీసు చీఫ్ తెలిపారు. నిందితులను సైతం కోర్టు ముందు హాజరుపరిచారు. ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవాళ్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు ఢిల్లీ పోలీస్ కమీషనర్ రాకేశ్ ఆస్థానా (Delhi Police Commissioner Rakesh Asthana) వెల్లడించారు.