K Kavitha Walks Out of Tihar Jail: ఉద్విగ్నభ‌రిత వాతావ‌ర‌ణంలో ఎమ్మెల్సీ క‌విత విడుద‌ల‌, జైలు నుంచి ఇంటికి ఆటోలో వెళ్లిన కేటీఆర్, ఇవాళ హైద‌రాబాద్ కు క‌విత‌, ఘ‌న‌స్వాగ‌తానికి ఏర్పాట్లు

రౌస్‌ అవెన్యూ న్యాయస్థానం నుంచి కవిత బెయిల్‌కు సంబంధించిన పత్రాలను న్యాయవాదులు జైలు అధికారులకు సమర్పించారు. జైలు లాంఛనాలు పూర్తయిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆమె బయటకు వచ్చారు. కవిత విడుదల సందర్భంగా తీహార్‌ జైలు వద్దకు పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.

K Kavitha (Photo Credit: X/@ANI)

Hyderabad, AUG 28: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఉద్విగ్నభరిత వాతావరణంలో తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్‌కు (MLC Kavitha Bail) సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయ్యాక ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. కవిత బెయిల్‌ పిటిషన్‌ మంగళవారం సుప్రీం కోర్టు ముందుకు వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ (KTR) సోమవారమే ఢిల్లీకి వెళ్లారు. వారితోపాటు మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్‌, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, ముఠా గోపాల్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎంపీ కవిత, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ఉదయమే సుప్రీం కోర్టు వద్దకు చేరుకున్నారు. కవిత కేసుకు సంబంధించిన కోర్టు హాలు వద్ద వాదనలను ఆసాంతం విన్నారు. తీర్పు కోసం ఆతృతగా ఎదురుచూశారు. న్యాయస్థానం బెయిల్‌ ఇస్తున్నట్టు చెప్పిన వెంటనే కేటీఆర్‌ ముఖంలో పట్టరాని ఆనందం కనిపించింది. న్యాయమూర్తి తీర్పు చెప్పే సమయంలో కేటీఆర్‌ ఒకింత ఉద్విగ్నానికి లోనయ్యారు. తీర్పు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన కేటీఆర్‌, హరీశ్‌ రావు అక్కడ ఉన్న పార్టీ నేతలను ఆలింగనం చేసుకొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. తుది తీర్పు రావడంతో వెంటనే తదుపరి కార్యాచరణ రూపొందించుకునేందుకు, బెయిల్‌ కాపీలు, ష్యూరిటీలు తదితర వాటి గురించి న్యాయవాదులతో మాట్లాడారు. ష్యూరిటీల్లో ఒకటి కవిత భర్త అనిల్‌కుమార్‌ ఇవ్వగా మరోటి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇచ్చారు. సుప్రీం కోర్టులో లాంఛనాలను పూర్తిచేసుకొని అక్కడి నుంచి ఎంపీ వద్దిరాజు నివాసానికి ఆటోలోనే కేటీఆర్‌ వెళ్లారు. కోర్టు వద్ద ప్రజలు ఎక్కువగా ఉండటం, అందుబాటులో ఆటో రావటం తో అందులో వద్దిరాజు నివాసానికి వెళ్లారు.

వీడియో ఇదుగోండి

హరీశ్‌రావు (Harish Rao), కేటీఆర్‌తోపాటు పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్‌ సురేశ్‌రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra), దీవకొండ దామోదర్‌రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంబీపూర్‌ రాజు, కేపీ వివేక్‌ తదితరులు కూడా వచ్చారు. కవిత భర్త అనీల్‌ కుమార్‌, ఆమె పిల్లలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీ లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున కవితకు జైలు వద్ద స్వాగతం పలికారు. గంటల తరబడి వేచి చూసిన వీరంతా ‘కవిత.. డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని కవితకు స్వాగతం పలికారు. జైలు పరిసరాల్లో మిఠాయిలు పంచారు. జైలు నుంచి కవిత నేరుగా వసంత విహార్‌లో ఉన్న పార్టీ కార్యాలయానికి వెళ్లారు.

వీడియో ఇదుగోండి

 

జైలు నుంచి బయటకు వచ్చిన కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గేటు బయటే ఉన్న పెద్ద కొడుకు ఆదిత్య, భర్త అనిల్‌, సోదరుడు కేటీఆర్‌ను ఆలింగనం చేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. బుధవారం మధ్యాహ్నం 2.45గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయల్దేరనున్నారు. నేరుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి రానున్నారు. కవిత రాక సందర్భంగా అభిమానులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు ఆమెకు సాదరస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.