Kargil Vijay Diwas: కార్గిల్ వార్, ప్రతీ భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర, యుద్ధం ఎలా ప్రారంభమైంది?,ఎలా ముగిసింది?,జవాన్ల త్యాగాలను స్మరించుకుందాం
ప్రతి భారతీయుడు ఇది నా దేశం అని సగర్వంగా చెప్పకున్న రోజు. దాయాది దేశం పాకిస్థాన్ కుట్రలను చీల్చిచెండాడుతూ యావత్ దేశం ఏకతాటిపై నడిచి విజయం సాధించిన రోజు. అదే కార్గిల్ విజయ్ దివాస్.
Delhi, July 26: కార్గిల్ జిల్లా ఉత్తర ప్రాంతంలో భారతదేశ నియంత్రణ రేఖను దాటి పాక్ సైనికులు, ఉగ్రవాదులు చోరబాటును 1999 మేలో గుర్తించారు భారత జవాన్లు. వెంటనే అప్పటి కేంద్ర ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది. అత్యంత సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో రెండున్నర నెలల పాటు పాక్‌తో యుద్ధం జరిగింది. చివరకు పాక్ చొరబాటుదారులను విజయవంతంగా తరిమికొట్టి టైగర్ హిల్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది. సరిగ్గా జులై 26వ తేదీన కార్గిల్ కు పాక్ చెర నుండి విముక్తి లభించింది. ఈ భీకర పోరులో 527 మంది జవాన్లు అమరులయ్యారు.
యావత్ భారతావని పాక్ ఆక్రమణలను ముక్తకంఠంతో ఖండించింది. ఈ భీకర పోరులో అమరులైన రియల్ హీరోలకు సెల్యూట్ చేస్తూ యావత్ భారతం ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుతోంది.
కార్గిల్ వార్ చరిత్రను ఓ సారి పరిశీలిస్తే..
1999 మే 3న కార్గిల్‌లో పాకిస్తాన్ తీవ్రవాదులు, సైనికులు చొరబడ్డట్లు గొర్రెల కాపరులు చెప్పారు. అనంతరం మే 5న భారత సైన్యం గస్తీ దళాన్ని పంపించింది. ఐదుగురు భారతీయ సైనికులను పట్టుకుని చిత్రహింస చేసి పాక్ చొరబాటు దారులు చంపేశారు. మే 9న పాకిస్తాన్ సైన్యం చేసిన శతఘ్ని దాడిలో కార్గిల్ ఆయుధాగారం ధ్వంసమైంది. ఆ తర్వాత మే 10న ద్రాస్, కక్సార్, ముష్ఖో సెక్టార్లలో చొరబాట్లు కనుగొన్నారు.ఆ తర్వాత కాశ్మీరులోయ నుండి మరింత మంది సైనికులను కార్గిల్ సెక్టారుకు పంపించింది కేంద్ర ప్రభుత్వం.
మే 26న చొరబాటుదారులపై భారత వాయుసేన దాడులు చేసింది. మే 27న భారత వాయుసేన ఒక మిగ్-21 ను, ఒక మిగ్-27 ను కోల్పోయింది. ఫ్లైట్ లెఫ్టె నచికేతను యుద్ధఖైదీగా పట్టుకున్నారు. మే 28న భారత వాయుసేనకు చెందిన ఎమ్‌ఐ-17 హెలికాప్టరును పాకిస్తాన్ కూల్చివేసింది. నలుగురు సిబ్బంది మరణించారు. జూన్ 1న పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది. జాతీయ రహదారి 1ఎ పై బాంబులు వేసింది.
జూన్ 5న ముగ్గురు పాకిస్తాన్ సైనికుల నుండి స్వాధీనం చేసుకున్న పత్రాలని భారత సైన్యం బయటపెట్టి పాకిస్తాన్ జోక్యాన్ని బయటపెట్టింది. జూన్ 6న భారత సైన్యం పెద్ద ఎత్తున దాడి మొదలుపెట్టింది. జూన్ 9న బటాలిక్ సెక్టారులో రెండు కీలక స్థావరాలను భారత సైన్యం తిరిగి స్వాధీన పరచుకుంది.జూన్ 11న పాకిస్తాన్ సైనిక ప్రధానాధికారి జనరల్ పర్వేజ్ ముషారఫ్, ఛీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టె. జనరల్. అజీజ్ ఖాన్ తో జరిపిన సంభాషణను బయటపెట్టి పాకిస్తాన్ సైన్యపు జోక్యాన్ని నిరూపించింది. వీర జవాన్ల యాదిలో, 25వ కార్గిల్ విజయ్ దివస్, నివాళులు అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
జూన్ 13న ద్రాస్ సెక్టారులోని తోలోలింగ్‌ను భారత సైన్యం స్వాధీనపరచుకుంది. జూన్ 15న అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో టెలిఫోనులో మాట్లాడుతూ, కార్గిల్ నుండి తప్పుకోమని చెప్పాడు. జూన్ 2న భారత సైన్యం టైగర్ హిల్ వద్ద ఉన్న రెండు కీలక స్థావరాలను పాయింట్ 5060, పాయింట్ 5100 స్వాధీనపరచుకుంది. జూలై 2న భారత సైన్యం త్రిముఖ దాడిని మొదలుపెట్టింది. జూలై 4 న 11 గంటల పోరు తరువాత, భారత సైన్యం టైగర్ హిల్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది. జూలై 5న భారత సైన్యం ద్రాస్‌పై నియంత్రణ సాధించింది. క్లింటన్‌తో సమావేశం తరువాత, పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కార్గిల్ నుండి వెనక్కి వెళ్తున్నట్లు ప్రకటించాడు.
జూలై 7న బటాలిక్ సెక్టారులోని జుబర్ హైట్స్‌ను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. జూలై 11న పాకిస్తాన్ వెనక్కి వెళ్ళడం మొదలైంది. బటాలిక్ లోని కీలక శిఖరాలను భారత సైన్యం స్వాధీనపరచుకుంది.జూలై 14న ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని అప్పటి భారత ప్రధాని వాజపేయ్ ప్రకటించాచరు. పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ షరతులు విధించింది. జూలై 26న కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది.