Karnataka Bandh: కావేరి జలాల రగడ, కర్ణాటక బంద్‌తో 44 విమానాలు రద్దు, బెంగుళూరులో 144 సెక్షన్ అమల్లోకి, గత బంద్‌తో రాష్ట్ర ఖజానాకు రూ.1000 నుంచి 1500 కోట్లు నష్టం
ఇందుకు 100కు పైగా సంఘాలు మద్దతు ప్రకటించాయి.
Bengaluru, Sep 29: తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ శుక్రవారం కన్నడ ఒక్కూట అఖండ కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందుకు 100కు పైగా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇక బెంగళూరు అంతర్జాతీయ(Bengaluru International Airport) విమానాశ్రయంలో 44 విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
కన్నడ ఒక్కూట(Kannada Okkata) అనే సంస్థ బంద్ కు పిలుపునివ్వగా.. చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు.కర్ణాటక బంద్ లో భాగంగా బెంగళూరు ఎయిర్ పోర్ట్ లోకి కొందరు కన్నడ అనుకూల కార్యకర్తలు చొచ్చుకువచ్చారు. నీటి తరలింపునకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చొచ్చుకువచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు అయిదుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు.
కర్ణాటక బంద్ నేపథ్యంలో బెంగళూరులో గట్టి పోలీస్ బందోబస్తు కల్పించినట్లు పోలీస్ కమిషనర్ బీ దయానంద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. శుక్రవారం ఎక్కడా ధర్నా, ర్యాలీ, ఊరేగింపులకు అవకాశం లేదు. గురువారం రాత్రి నుండే 144 సెక్షన్ జారీలోకి వచ్చింది. బంద్ అనేవారికి నోటీసులు ఇస్తాము. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారం బంద్‌కు పిలుపునివ్వడం చట్ట విరుద్ధం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పోలీస్ శాఖ పనిచేస్తుందని చెప్పారు. బంద్ సమయంలో ప్రభుత్వ ఆస్తిపాస్తులకు నష్టం కలిగిస్తే పిలుపునిచ్చినవారే బాధ్యులవుతారన్నారు. నగరవ్యాప్తంగా పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించినట్లు తెలిపారు.
కర్ణాటక బంద్ అయినప్పటికీ కేఎస్‌ఆర్‌టీసీ, బీఎంటీసీ బస్సులను యథావిధిగా నడపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఉద్యోగులు మామూలుగానే డ్యూటీలకు రావాలని ప్రకటించారు. ఎవరూ కూడా బంద్‌లో పాల్గొనరాదని, విధులకు రాకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. బస్టాపులు, బీఎంటీసీ డిపోలకు పోలీస్ భద్రత కల్పిస్తున్నారు.
కర్ణాటక రక్షణ వేదికె, జయ కర్ణాటక సంఘం, ఇతర కన్నడ సంఘాలు, రైతు సంఘం, హసిరుసేన, చెరకు సాగుదారుల సంఘం, ట్యాక్సీ- ఆటోరిక్షా సంఘాలు, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి, సినిమా కళాకారుల సంఘం తదితర వందకు పైగా సంస్థలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం ఆరు నుంచే బంద్ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనకారులు నిరసన (Protests) చేపట్టారు. మైసూరులో బస్టాంట్ ఎదుట రైతు సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Here's Videos
చిక్కమంగళూరులో కొందరు ఆందోళనకారులు పెట్రోల్‌బంక్‌లోకి దూసుకొచ్చి బలవంతంగా మూసివేయించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 50 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బంద్ దృష్ట్యా శుక్రవారం అర్ధరాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పలు చోట్ల సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, కేఆర్‌ఎస్ ఆనకట్ట, పర్యాటక, చారిత్రక కట్టడాల వద్ద ప్రభుత్వం భద్రతను పెంచింది.
అటు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తమిళనాడు వెళ్లే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. గురువారం రాత్రి 10 గంటల తర్వాత తమిళనాడుకు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సులను ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారం అర్ధరాత్రి వరకు నిలిపివేశారు. మరోవైపు కన్నడ సంఘాలకు వ్యతిరేకంగా తమిళనాడులోనూ కొన్ని చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
కావేరీ జలాల విడుదలపై గత మంగళవారం బెంగళూరులో బంద్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ బంద్ కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.1000-1500కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రోజుల వ్యవధిలోనే మరోసారి బంద్ చేపట్టడం.. భారీ నష్టానికి దారితీస్తుందని పరిశ్రమలు, ఉద్యోగుల సంఘాలు వెల్లడించాయి.