Karnataka Bandh: కర్ణాటకలో కొనసాగుతున్న బంద్, ఎండీఎం ఏర్పాటు, నిధులపై మండిపడ్డ కన్నడిగులు, నైతిక మద్దతు ప్రకటించిన ట్యాక్సీ, ఆటో, ఓలా, ఉబర్‌ సంఘాలు, వ్యాపారులు

బంద్‌కు ట్యాక్సీ, ఆటో, ఓలా, ఉబర్‌ సంఘాలు మద్దతు పలకడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.

Karnataka Bandh | Visuals from Bengaluru (Photo Credits: ANI)

Bengaluru, December 5: సీఎం యడ్యూరప్ప నవంబర్‌ 14న ప్రకటించిన మరాఠా అభివృద్ధి అథారిటీ (MDM) ఏర్పాటు, వారి అభివృద్ధి కోసం రూ.50కోట్లు కేటాయించడంపై కన్నడ అనుకూల సంస్థలు శనివారం బంద్‌కు (Karnataka Bandh) పిలుపునిచ్చాయి. బంద్‌కు ట్యాక్సీ, ఆటో, ఓలా, ఉబర్‌ సంఘాలు మద్దతు పలకడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఫుట్‌పాత్‌ వ్యాపారులు, ఏపీఎంసీ వ్యాపారులు నైతిక మద్దతు ఇస్తున్నారు. బార్, మాల్స్‌ యాజమాన్యాల సంఘం కూడా కన్నడ సంఘాల పోరాటానికి మద్దతు ఇచ్చింది. బంగారు నగల దుకాణాల యజమానులు బంద్‌కు నైతిక మద్దతును ప్రకటించింది.

రాష్ట్ర బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వరాదని ముఖ్యమంత్రి బీ.ఎస్‌.యడియూరప్ప విన్నవించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ బలవంతంగా బంద్‌ చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. కన్నడ అభివృద్ధికి మరిన్ని సలహాలు ఇస్తే అమలుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బంద్‌ విరమించుకోవాలని తాను ప్రజా పోరాట నాయకుడు వాటాళ్‌ నాగరాజుకు విన్నవిస్తున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే చిక్కమగళూరు, ధార్వాడ, విజయపుర, బళ్లారి, కొప్పళ, మైసూరు, కోలారు, చిక్కబళ్లాపురతో పాటు వివిధ జిల్లాల్లో కన్నడ సంఘాలు ధర్నా, ర్యాలీలకు సమాయత్తమయ్యాయి. బస్సులను అడ్డుకోవడంతోపాటు రైల్‌రోకో చేపట్టాలని కర్ణాటక రక్షణా వేదిక నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేఎస్‌ఆర్‌ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌ నుంచి ఫ్రీడమ్‌ పార్క్‌ వరకు ర్యాలీ తీయనున్నారు.

డిసెంబర్ 8న భారత్ బంద్, దేశ రాజధానిలో తీవ్ర రూపం దాల్చిన రైతుల ఉద్యమం, కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే రైతుల పోరాటానికి మద్ధతుగా నిలిచిన సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దుష్యంత్‌ దవే

అయితే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బస్సు సేవలు, మెట్రో సేవలు కొనసాగుతాయని, బంద్‌కు వెళ్లొద్దని సీఎం యడ్యూరప్ప స్పష్టం చేశారు. కర్ణాటకతో సంబంధం ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. తాను కన్నడకు ప్రాముఖ్యతను ఇచ్చానని, వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇదిలా ఉండగా బంద్‌ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం భద్రతను పెంచింది

దుకాణాలు, వాణిజ్య సముదాయాలను బలవంతంగా మూసివేయకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటికే హోటళ్ల యజమానులు, ట్రావెల్‌ ఆపరేటర్లు బంద్‌ పాటించబోమని స్పష్టం చేశారు. పలు రవాణా సంఘాలు, ఆటో, ట్యాక్సీ యూనియన్లు మాత్రం బంద్‌కు సంఘీభావం ప్రకటించాయి. కేఎస్‌ఆర్‌టీసీ, బీఎంటీసీ బస్సులు యధా ప్రకారం తిరుగుతాయని రవాణా శాఖ తెలియజేసింది.

శనివారం కర్ణాటక బంద్‌కు ఎవరూ అనుమతి కోరలేదని బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌ శుక్రవారం విలేకరులకు తెలిపారు. తాము కూడా కర్ణాటక బంద్‌కు అనుమతిని ఇవ్వలేదన్నారు. శనివారం బెంగళూరులో ఎలాంటి ర్యాలీలకు అవకాశం కల్పించేది లేదన్నారు. బంద్‌పై భయపడాల్సిన అవసరం లేదన్నారు. శాంతిభద్రతలకు అంతరాయం కలిగించినవారిపై చర్యలు తీసుకొంటామన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా వహించామని తెలియజేశారు.

మరాఠ అభివృద్ధి ప్రాధికారను (Maratha Development Authority) వ్యతిరేకిస్తూ చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త బంద్‌ను భగ్నం చేయడానికి యత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కన్నడ చళవళి పక్ష అధ్యక్షుడు వాటాళ్‌ నాగరాజ్, డాక్టర్‌ రాజ్‌కుమార్‌ అభిమానుల సంఘం అధ్యక్షుడు సా.రా.గోవిందు హెచ్చరించారు. శుక్రవారం మైసూరు బ్యాంక్‌ సర్కిల్‌లో పొర్లు దండాలు పెట్టిన కన్నడ ఒక్కూట నాయకులు శనివారం బంద్‌కు మద్దతునివ్వాలని విన్నవించారు.

రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ అప్రమత్తమైంది. దాదాపు 15 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. 33 కేఎస్‌ఆర్‌పీ, 32 సీఏఆర్‌ బెటాలియన్‌లను బందోబస్తుకు నియమించారు. శనివారం రాష్ట్ర బంద్‌ సందర్భంగా బలవంతంగా దుకాణాలు మూయిస్తే ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీవైఎస్పీ రంగప్ప హెచ్చరించారు.