Bharat Bandh on Dec 8: డిసెంబర్ 8న భారత్ బంద్, దేశ రాజధానిలో తీవ్ర రూపం దాల్చిన రైతుల ఉద్యమం, కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే రైతుల పోరాటానికి మద్ధతుగా నిలిచిన సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దుష్యంత్‌ దవే
Farmers' protest in Delhi | (Photo Credits: PTI)

New Delhi, December 5: మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు..కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు తమ ఉద్యమాన్ని (Farmers Protest in Delhi) ముమ్మరం చేయాలని నిర్ణయించారు. డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌ (Bharat Bandh on Dec 8) కార్యక్రమాన్ని రైతులు తలపెట్టారు. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోని మిగిలిన రహదారులను సైతం అడ్డుకునే ప్రణాళిక రూపొందించినట్లు రైతు నాయకుడు హర్విందర్‌ సింగ్‌ లఖ్వాల్‌ తెలిపారు. మోడీ ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థల దిష్టిబొమ్మలను నేడు దేశవ్యాప్తంగా దగ్ధం చేయాలని నిర్ణయించారు.

శుక్రవారం 35 రైతు సంఘాల నేతలు (Farmer leaders) సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. కేంద్రంతో జరుగుతున్న చర్చల తీరుతెన్నులు, మోదీ ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై చర్చించారు. అందులో భాగంగా ఈ నెల 8వ తేదీన భారత్‌ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి లాఖోవాల్‌ ప్రకటించారు. 5వ తేదీన దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని నిర్ణయించామని తెలిపారు. చట్టాలను రద్దు చేయాల్సిందేనని, లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న రైతులకు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది దుష్యంత్‌ దవే మద్దతు ప్రకటించారు. తాను రైతుల పక్షాన నిలబడుతానని వెల్లడించారు. రైతులు కోరితే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వారి తరఫుణ కేసులు వాదిస్తానని చెప్పారు. దీనికోసం వారి నుంచి పైసా కూడా తీసుకోనని ఉచితంగానే కేసులు వాదిస్తానని తెలిపారు. దవే నిన్న ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాకు దిగిన రైతులతో సమావేశమయ్యారు. అనంతరం ఈమేరకు ప్రకటన చేశారు. కాగా, దుష్యంత్‌ దవే వంటి సీనియర్‌ లాయర్లు రైతుల పక్షాన పోరాటానికి సిద్ధవుతున్నారని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతుచట్టాలపై పునరాలోచించుకోవాలని న్యాయవాది హెచ్‌ఎస్‌ పుల్కా కోరారు. రైతులకు మద్ధతు ప్రకటించినందుకుగాను ఆయన దవేకు కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ సర్కారుకు షాక్, రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే ఎన్డీయే నుంచి వైదొలుగుతామని ప్రకటించిన ఆర్‌ఎల్‌పీ, దేశ రాజధానిలో 5వ రోజుకు చేరిన రైతుల నిరసనలు

ఇక గణతంత్ర దినోత్సవ కవాతులో రైతులు పాల్గొనాలని ఢిల్లీ –ఘజియాబాద్‌ సరిహద్దులో ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు నాయకుడు రాకేశ్‌ తికాయత్‌ పిలుపునిచ్చారు. మరోవైపు భారత ప్రభుత్వ సవరణను అంగీకరించే ప్రసక్తిలేదని, సింఘు సరిహద్దులో ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిసాన్‌ సభ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లాహ్‌ తెలిపారు. రైతు ఉద్యమాన్ని పంజాబ్‌ ఉద్యమం అని మాత్రమే ప్రచారం చేస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర అని విమర్శించారు. అయితే ఈ ఉద్యమం భారతదేశం అంతటా జరుగుతోందని, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించని పరిస్థితుల్లో, ఉద్యమం మరింత దూకుడుగా జరుగుతుందని మొల్లాహ్‌ హెచ్చరించారు.

గురువారం అసంపూర్తిగా ముగిసిన చర్చలను మరోసారి కొనసాగించేందుకు రైతులు సంఘాల నాయకులు, కేంద్రం సిద్ధమయ్యారు. రైతులు చేస్తున్న నిరసనలు పది రోజులకు చేరుకున్న నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్రంతో రైతులు మరో దఫా చర్చలు జరుపనున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర విదేశాంగ శాఖ భారత్‌లో కెనడా హైకమిషనర్‌ నాదిర్‌ పటేల్‌ను శుక్రవారం హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అనంతరం కెనడా ప్రధాని, కేబి నెట్‌ మంత్రులు భారత్‌లో జరుగుతున్న నిరసనలపై స్పందించడాన్ని తప్పుబడుతూ.. అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇరు దేశాల మధ్య బంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది.

మాటల్లేవ్.., మా డిమాండ్లు నెరవేర్చాల్సిందే, ఢిల్లీలో కదం తొక్కుతున్న రైతులు, మూడో రోజుకు చేరిన చలో ఢిల్లీ నిరసన కార్యక్రమం

వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌ చెబుతున్నదాని ప్రకారం... ఈ చర్చల్లో ఏదో ఒకటి తేలిపోవచ్చు. అటు ఆర్‌ఎస్ఎస్‌ అనుబంధ సంఘమైన భారతీయ కిసాన్‌ సంఘ్‌ కూడా రైతుల డిమాండ్లకు మద్దతు పలికింది. కనీస మద్దతు ధర వ్యవస్థను కొనసాగించాలని, ప్రభుత్వ, ప్రైవేటు మండీల్లో కూడా ఎంఎస్పీ రేటే అమలుకావాలని, ఇందుకు చట్టం చేయాలని, ఎంఎస్పీ కంటే చౌక ధరకు కొనడం నేరమని చట్టంలో చేర్చాలని బీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి బదరీనారాయణ చౌధురి మీడియాతో అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి రైతు కోర్టులను ఏర్పాటుచేయాలి తప్ప ఎస్‌డీఎం కోర్టుల్లో కాదని కూడా ఆయన కోరారు.

దేశరాజధాని ప్రాంతంలో రైతుల నిరసనలు 9వ రోజుకు చేరుకున్నాయి. సింఘూ, టిక్రీ, గాజీపూర్‌, నోయిడా సరిహద్దుల్లో రహదారులపై రైతులు నిరసనలు సాగిస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ గజ వణికిస్తున్న చలిలోనూ రాత్రంతా రోడ్లపైనే నిద్రిస్తున్నారు. అక్కడే వండుకొని ఆహారాన్ని తింటున్నారు. నిరసనల వల్ల పలు రహదారులను మూసివేశారు. నిరసనల్లో పలువురు తెలంగాణకు చెందిన రైతులు కూడా పాల్గొన్నారు. తృణముల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ రైతు నేతలతో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆ తరువాత తమ ఎంపీ డెరిక్‌ ఒబ్రెయిన్‌ను ... సంఘూ సరిహద్దులకు పంపి- రైతులను కలుసుకొని సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలియపర్చారు. ఆయన అక్కడినుంచి మమతతో ఫోన్లో మాట్లాడించారు.

రైతులకు మద్దతుగా ప్రముఖ రచయిత డాక్టర్‌ జస్వీందర్‌ సింగ్‌ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును వాపస్‌ ఇచ్చారు. ‘‘రైతుల పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్దాక్షిణ్య వైఖరి, మానవ హక్కుల ఉల్లంఘన నన్ను బాధించింది. అందుకే అవార్డు వాపస్‌ ఇస్తున్నాను’’ అని ప్రకటించారు.

రైతులు ఒంటరివారు కాదని, వారి వెనుక దేశ ప్రజలున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్‌ అన్నారు. దేశ ప్రజలు కావాలా లేదా అదానీలు, అంబానీలు కావాలా అన్నది ప్రధాని తేల్చుకోవాలని సూచించారు. రైతులకు మద్ధతుగా వ్యవసాయ కార్మిక సంఘం నేతృత్వంలో జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఆయన ఈ మాటలన్నారు. కాగా, ఢిల్లీ చుట్టూ రహదారులను రైతులు దిగ్భందించడంతో నిత్యవసరాలకు కొరత ఏర్పడొచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రోడ్ల మూసివేత వల్ల రవాణా వాహనాలు పూర్తి స్థాయిలో రాలేకపోతున్నాయి. దాంతో నిరసనలు కొనసాగితే త్వరలో సరుకులకు కొరత ఏర్పడుతుందని ఆ వర్గాలు తెలిపాయి.

దేశరాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులను అక్కడి నుంచి తొలగించేట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. నిరసనల వల్ల ఢిల్లీలో కరోనా విజృంభించొచ్చని పిల్‌ వేసిన న్యాయవాది ఓం ప్రకాశ్‌ పరిహార్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయని, రైతుల ఆందోళనతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతుందన్నారు. బురారీ గ్రౌండ్స్‌లో నిరసన జరిపేందుకు ప్రభుత్వం అనుమతించిందని, అక్కడికి తరలించాలన్నారు. రోడ్లను దిగ్భందించడం సరికాదని షహీన్‌బాగ్‌ కేసులో సుప్రీం తీర్పును ఉటంకించారు.