Farmers Protest: మోదీ సర్కారుకు షాక్, రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే ఎన్డీయే నుంచి వైదొలుగుతామని ప్రకటించిన ఆర్‌ఎల్‌పీ, దేశ రాజధానిలో 5వ రోజుకు చేరిన రైతుల నిరసనలు
Farmers Protest in Burari Ground. (Photo Credits: ANI | Twitter)

New Delhi, Dec 1: మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు దేశ వ్యాప్తంగా రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు (Farmer Protests in Delhi) దారితీస్తోంది. గత పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమోదం పొందిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా రైతులు, రైతు సంఘాల నేతలు దేశ రాజధాని వేదికగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఐదు రోజులుగా దేశ రాజధానిలో ఆందోళన చేపడుతున్నారు. రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్‌ వర్గాలకు అనుకూలంగా రూపొందించిన బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్‌, హర్యానా, రాజస్తాన్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తమ డిమాండ్స్‌కు కేంద్రం దిగొచ్చేవరకు నిరసన (massive farmer protests) కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు.

ఇది ఇలా ఉంటే ఎన్డీయే సర్కారుకు మిత్రపక్షం లోక్‌తాంత్రిక్‌ పార్టీ (RLP) షాకిచ్చింది. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించపోతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగతామని రాజస్తాన్‌కు చెందిన బీజేపీ మిత్రపక్షం లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) (Rashtriya Loktantrik Party (RLP) అధ్యక్షుడు హనుమాన్‌ బేనివాల్‌ ప్రకటించారు. దేశ రాజధాని నడిబొడ్డున చలిలో వేలాది రైతులు దీక్షలు నిర్వహిస్తుంటే కేంద్రం పట్టించుకోకపోడం దారుణమన్నారు. ఈ మేరకు కేం‍ద్రహోంమంత్రి అమిత్‌ షాకు (Home Minister Amit Shah) సోమవారం బేనివాల్‌ లేఖ రాశారు.

రైతుల డిమాండ్స్‌కు వెంటనే స్పందించి కేంద్ర ఓ నిర్ణయానికి రావాలని డిమాండ్‌ చేశారు. కాగా రాజస్తాన్‌లో బలమైన సామాజిక వర్గం మద్దతుదారులను కలిగిఉన్న ఆర్‌ఎల్‌పీ ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు 15 పార్లమెంట్‌ స్థానాల్లో ప్రభాల్యం కలిగిన బేనివాల్‌.. తాజాగా రైతు దీక్షకు మద్దతు ప్రకటించారు. ఇప్పటికే ఆయా బిల్లులను వ్యతిరేకిస్తూ బీజేపీ చిరకాల మిత్రపక్షం శిరోమణీ అకాలీదళ్‌ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

కరోనా సెకండ్ వేవ్ ముప్పు, డిసెంబర్ 4న ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం, దేశంలో 94 లక్షల దాటిన కోవిడ్ కేసులు

పంజాబ్‌ రైతాంగానికి మద్దతుగా ఆ పార్టీ ఎంపీ హర్‌సిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌ కేంద్రమంత్రి పదవికి రాజీనామా సైతం సమర్పించారు. బిల్లులపై పార్లమెంట్‌లో చర్చసాగుతున్న తరుణంలో ఆమె ఈ నిర్ణయం తీసుకుని రైతులు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతులు వ్యతిరేక విధానాలను నిరశిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో గత ఐదు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం తమతో చర్చలకు ముందుకు రావాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సోమవారం రాత్రి ప్రకటించారు. రైతు సంఘాలు పోరాటం ఇక్కడితో ఆపాలని, చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు.

వాస్తవానికి డిసెంబర్‌ 3న రైతు సంఘాల నాయకులతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు నానాటికీ పెరుగుతుండడం, చలి సైతం తీవ్రమవుతుండడంతో రెండు రోజుల ముందే చర్చలు సాగించాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు.. అక్టోబర్‌ 14, నవంబర్‌ 13న రైతులతో చర్చించింది. మంగళవారం(డిసెంబర్‌ 1) మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మూడో దఫా చర్చలు జరగనున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై రైతులు, రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు.

మాటల్లేవ్.., మా డిమాండ్లు నెరవేర్చాల్సిందే, ఢిల్లీలో కదం తొక్కుతున్న రైతులు, మూడో రోజుకు చేరిన చలో ఢిల్లీ నిరసన కార్యక్రమం

కాగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనకు మద్దతుగా హర్యానా లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ బోర్డ్ చైర్మన్ పదవికి చెందిన ఎమ్మెల్యే సోంబిర్ సంగ్వాన్ సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు అందించారు. గతేడాది హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నిల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగ్వాన్.. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం బీజేపీ-జేజేపీ కూటమికి మద్దతు తెలిపారు.

రైతులకు మద్దతుగా నేను ప్రస్తుతం ఉన్న పదవికి రాజీనామా చేస్తున్నాను. దేశంలో రైతులందరితో పాటు నా నియోజకవర్గమైన దాద్రి నియోజకవర్గ రైతులు కూడా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో రైతులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అంతే కాకుండా ఇది నా బాధ్యత కూడా. నా మనస్సాక్షిని నేను ప్రశ్నించుకున్నాను. రైతులకు మద్దతు తెలపడమే సరైందని అనిపించింది. అందుకే వారికి మద్దతు ఇస్తున్నాను’’ అని సీఎంకు రాసిన లేఖలో సాంగ్వాన్ రాసుకొచ్చారు.

కరోనా హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా అన్నదాతలు నిరసన సాగిస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యవసాయ చట్టాలు కరోనా కంటే మరింత ప్రమాదకరమని పేర్కొంటున్నారు. ధర్నాలో ఉన్న రైతులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహమ్మారిపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఏడుగురు వైద్యులతో కూడిన బృందం నవంబర్‌ 28 నుంచి 90 మంది రైతులకు పరీక్షలు చేసింది. వీరిలో ఎవరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదని డాక్టర్లు చెప్పారు.

చర్చల విషయం లో కేంద్రం ఎలాంటి షరతులు విధించరాదని రైతులు పేర్కొన్నారు. అవసరమైతే ఢిల్లీని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ సోమవారం ఐదో రోజుకు చేరుకుంది. చలిని సైతం లెక్కచేయకుండా సింఘు, టిక్రీ రహదారులపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు. రైతుల ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మద్దతు తెలిపారు.