PM Narendra Modi (Photo Credits: ANI/File)

New Delhi, November 30: దేశంలో కరోనావైరస్ రెండవ దశకు ప్రవేశించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కోవిడ్ పరిస్థితిపై చర్చించడానికి ప్రధాని అధ్యక్షతన డిసెంబర్ 4న అఖిలపక్ష సమావేశం (PM Narendra Modi to Chair All-Party Meet) జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు.

ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి (Minister of Parliamentary Affairs Prahlad Joshi) ఇప్పటికే ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లకు సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో కోవిడ్ పరిస్థితిపై ప్రధాని మోదీ ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. అయితే అఖిల పక్షం భౌతికంగా భేటీ అవుతుందా? లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుందా? అన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్రం తీసుకుంటున్న జాగ్రత్తలు, పంపిణీ విధానం లాంటి ముఖ్యమైన అంశాలను ఆయా పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోదీ వివరించనన్నారు.

దేశంలో 1,37,139కు చేరిన కోవిడ్ మరణాల సంఖ్య, తాజాగా 443 మంది మృతి, 94 లక్షల 31 వేలకు చేరిన మొత్తం కరోనా కేసులు, కోవిడ్‌తో బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కన్నుమూత

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 94 లక్షలకు మందికి పైగా కరోనా వైరస్‌ (Covid Cases in India) బారిన పడ్డారు. ఇక కోవిడ్‌ కేసుల్లో ప్రపంచంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే అమెరికాతో పోలిస్తే ఇండియాలో కోవిడ్‌ మరణాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఇక ఇప్పటిక వరకు దేశ వ్యాప్తంగా 88 లక్షలకు పైగా కోవిడ్‌ బారిన పడి కోలుకోగా.. 1.3లక్షలకు మందికి పైగా మరణించారు. దేశంలో తొలి కోవిడ్‌ మరణం జనవరి 30, 2020న కేరళలో నమోదయ్యింది.

ఇక ప్రపంచ దేశాలన్ని కరోనా వ్యాక్సిన్‌ కోసం కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. భారత్‌లో కూడా నాలుగైదు వ్యాక్సిన్‌లు పలు దశల్లో ఉన్నాయి. దేశంలో కరోనా టీకా అభివృద్ధి కోసం మూడు ఫార్మా దిగ్గజ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అహ్మదాబాద్, హైదరాబాద్, పుణేలలో సుడిగాలి పర్యటన చేపట్టిన సంగతి కూడా విదితమే.