New Delhi, November 30: భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,772 కోవిడ్ పాజిటివ్ కేసులు (Coronavirus Cases in India) వెలుగుచూశాయి. 443 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 94 లక్షల 31 వేలకు చేరుకుంది. కోవిడ్ మరణాల సంఖ్య 1,37,139 దాటింది. ఇక ప్రస్తుతం దేశంలో 4,46,952 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో 45,333 మంది కోవిడ్ బాధితులు మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనాను జయించిన వారి సంఖ్య మొత్తంగా 88,47,600కు (Coronavirus Outbreak in India) చేరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 93.81గా ఉంది. నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 4.74 శాతంగా ఉంది. మరణాల రేటు 1.45శాతానికి తగ్గింది. ఈ మేరకు సోమవారం కేంద్ర, వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
కరోనావైరస్‌తో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూశారు. రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మహిళా ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్దరాత్రి మరణించారు.
బీజేపీ ఎమ్మెల్యే అయిన కిరణ్ మహేశ్వరికి కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో ఆమె గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్దరాత్రి కన్నుమూశారు. మహేశ్వరి గతంలో రాజస్థాన్ రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో ఈమె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలిగా, బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సేవలందించారు. మహేశ్వరి మృతి పట్ల బీజేపీ నేతలు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.