Mobile Phone Explodes: మొబైల్ పేలి చిన్నారి మృతి చెందిన ఘటనపై స్పందించిన షావోమి, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి

ఫోన్‌ పేలిన ఘటనపై రెడ్‌ మీ మొబైల్స్‌ మాతృ సంస్థ షావోమీ ఇండియా ప్రతినిధులు స్పందిస్తూ.. వినియోగదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు.

Mobile Phone Blast (Photo Credit- ANI)

Kerala, April 27: కేరళలో మొబైల్‌లో వీడియో చూస్తూ చిన్నారి మృతి చెందిన ఘటనపై షావోమీ సంస్థ స్పందించింది. ఫోన్‌ పేలిన ఘటనపై రెడ్‌ మీ మొబైల్స్‌ మాతృ సంస్థ షావోమీ ఇండియా ప్రతినిధులు స్పందిస్తూ.. వినియోగదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు.

ఈ కఠిన పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర అండగా ఉంటామని చెప్పారు. కొన్ని రిపోర్టులు రెడ్‌ మీ మొబైల్‌ పేలిందని చెప్తున్నాయి. అదింకా నిర్ధారణ కాలేదని, అధికారులకు సహకరించి నిజానిజాలు నిగ్గులేందుకు కృషి చేస్తామన్నారు.బాధిత కుటుంబానికి ఎటువంటి సాయమైనా చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

వీడియో చూస్తుండగా పెద్ద శబ్దంతో పేలిన మొబైల్ ఫోన్, 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక మృతి, కేరళలో ఘటన

ఈ ఘటనపై స్థానిక పోలీసుల బృందం దర్యాప్తు చేస్తోంది. అన్ని ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగింది. ఇక ఈ ఘటనకు కారణమైన మొబైల్‌ ఫోన్‌ మోడల్‌ రెడ్‌ మీ అని కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. అయితే, ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారులు చెప్తున్నారు.

కేరళ రాష్ట్రం త్రిస్సూర్ జిల్లా తిరువిల్వమలలో సెల్ ఫోన్ ఓ చిన్నారిని బలితీసుకున్న సంగతి విదితమే. మూడవతరగతి చదువుతున్న ఆదిత్యశ్రీ అనే చిన్నారి మొబైల్ కు చార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతుండగా.. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఫోన్ పేలింది. ఫోన్ ముఖంపై పేలడంతో తీవ్రంగా గాయపడ్డ పాప చనిపోయింది. ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి ఎక్కువ సేపు ఆడటం వల్లే అది వేడెక్కి పేలి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.