NIA Raids: ఖలిస్థానీలకు సాయం చేస్తున్న గ్యాంగ్‌స్టర్లపై నజర్, 6 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ విస్తృత సోదాలు, హవాలా నిధులపై దర్యాప్తు చేపట్టిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
ఈ నేపథ్యంలో ఈ దోస్తీపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA Raids) దృష్టి సారించింది. ఈ బంధానికి చెక్ పెట్టేందుకు ఇవాళ పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 50కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేశారు
New Delhi, SEP 27: దేశంలో ఖలిస్థానీలు-గ్యాంగ్‌స్టర్ల (Khalistan Gangsters) మధ్య బంధం ప్రమాదకరంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో ఈ దోస్తీపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA Raids) దృష్టి సారించింది. ఈ బంధానికి చెక్ పెట్టేందుకు ఇవాళ పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 50కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేశారు. బ్రిటిష్ కొలంబియాలో జూన్ 18న ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను (Nijjar Murder) హత్య చేయడంలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం, తర్వాత భారత్, కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తడం లాంటి పరిణామాల నడుమ ఇప్పుడు ఎన్‌ఐఏ దాడులు జరిగాయి.
ఖలిస్థానీ-గ్యాంగ్‌స్టర్ మధ్య బంధంతో ఆయుధాల కోసం హవాలా మార్గాల ద్వారా నిధులు సమకూరాయని ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. ఖలిస్థాన్ ఉగ్రవాదులు ఇక్కడి గ్యాంగ్‌స్టర్‌లకు నిధులు సమకూర్చడం, ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా విదేశీ నేల నుంచి దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
ఈ క్రమంలోనే పంజాబ్‌లోని 30, రాజస్థాన్‌లో 13, హర్యానాలో నాలుగు, ఉత్తరాఖండ్‌లోని రెండు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలోని వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం ఉదయాన్నే ఎన్‌ఐఏ అధికారులు రైడ్స్ నిర్వహించారు.