Union Cabinet Decisions: తొలి కేబినెట్ భేటీలోనే రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కారు, 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపు, తాజా పెంపుతో పలు పంటల మద్దతు ధరలు ఎలా ఉన్నాయంటే..

కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడ్డాక తొలి కేబినెట్‌ భేటీ ఇది

Ashwini Vaishnaw (Photo-ANI)

Kharif Crops MSP 2024-25: . ఈ భేటీలో వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. నూనె గింజలు, పప్పులకు మద్దతు ధర ఎక్కువగా పెంచారు. కందిపప్పునకు క్వింటాలుకు 552 రూపాయల ధర పెంచగా వరి, రాగి, జొన్న , పత్తి తదితర పంటలకు నూతన మద్దతు ధర ప్రకటించారు.

కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..వరి, రాగులు, మినుము, జొన్న, మక్కజొన్న, పత్తి సహా 14 ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర (MSP) కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు.

రైతు సంక్షేమం కోసం మంత్రివర్గంలో కీలకమైన నిర్ణయం తీసుకుందన్నారు. ఖరీఫ్ పంటకు 14 పంటలకు ఎంఎస్‌పికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. వరి కొత్త ఎంఎస్‌పీని రూ.2,300 నిర్ణయించినట్లు తెలిపారు. ఇది గత ఎంఎస్‌పీ కంటే రూ.117 ఎక్కువ. ఖరీఫ్ పంటల కొత్త ఎమ్మెస్పీపై అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘ఈ నిర్ణయంతో రైతులకు దాదాపు రూ.2లక్షల కోట్లు అందుతాయన్నారు. ఇది గత సీజన్ కంటే రూ.35వేల కోట్లు ఎక్కువ’ చెప్పారు.  ప్ర‌ధాని మోదీ కారుపై చెప్పు విసిరిన ఆగంత‌కులు, వార‌ణాసి ప‌ర్య‌ట‌న‌లో మోదీకి చేదు అనుభ‌వం, అంత సెక్యూరిటీ ఉన్నా..చెప్పు ఎలా వచ్చింద‌ని విచార‌ణ‌

పెంచిన ధరలను ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పెరిగిన ధరలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.తాజాగా కేంద్ర కేబినెట్ 14 పంటలకు మద్దతు ధర పెంచడంతో క్వింటాలు వరి ధర రూ.2,300కు చేరగా.. కంది పప్పు కనీస మద్దతు ధర రూ.7,550కు చేరింది. మినుములు క్వింటాలు ధర రూ.7,400 కాగా.. పెసలు రూ.8,682కు, వేరు శనగ ధర క్వింటా రూ.6783కు చేరింది. పత్తి కనీస మద్దతు ధర రూ.7,212కు, జొన్న ధర రూ.3.371కు చేరింది.

దీంతో పాటుగా కేంద్రం 2లక్షల గోడౌన్ల నిర్మాణానికి కసరత్తు చేస్తున్నది. మహారాష్ట్రలోని విధావన్‌ వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ డీప్‌ డ్రాఫ్ట్‌ పోర్టును రూ.76,200 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే టాప్‌- 10 పోర్టుల్లో ఒకటిగా నిలవనుంది. ఈ పోర్టు నిర్మాణం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు పది లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు అంచనా.

అలాగే గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం రూ.7,453 కోట్లతో చెరో 500 మెగావాట్ల సామర్థ్యంతో గిగావాట్‌ ఆఫ్‌షోర్‌ పవన విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే, వారణాసిలో అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.2,869.65 కోట్లతో కొత్త టెర్మినల్‌ భవనం నిర్మాణంతో పాటు రన్‌వేల విస్తరణ ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది.

తాజా పెంపుతో పలు పంటల మద్దతు ధరలు (క్వింటాల్‌) ఇలా..

వరి (సాధారణ రకం) రూ.2,300; వరి (గ్రేడ్‌-ఎ)- రూ.2,320; జొన్న (హైబ్రిడ్‌) రూ.3,371, జొన్న (మాల్దండి) 3,421; సజ్జలు రూ.2,625, రాగులు 4,290, మొక్కజొన్న రూ.2,225, వేరుశెనగ 6,783, పొద్దుతిరుగుడు విత్తనాలు రూ.7280, నువ్వులు రూ.9,267, సోయాబీన్‌ (పసుపు) 4,892, పెసలు రూ.8,682, పత్తి (మధ్యరకం) రూ.7,121, పత్తి (లాంగ్ స్టెపెల్‌) రూ.7,521, కంది రూ.7,550, మినుము రూ.7,400కి చేరాయి.