Cyclonic Storm Kyarr: తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం, నేడు,రేపు పలుచోట్ల భారీ వర్షాలు, కుమ్మేస్తున్న క్యార్ సైక్లోన్, హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
ఇది అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Hyderabad, November 1: అరేబియా సముద్రంలో ‘మహా’ తీవ్ర తుఫాను కొనసాగుతోంది. ఇది అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడన మాంద్యం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉండటంతో భారత వాతావరణ కేంద్రం అన్ని రాష్ట్రాల అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేసింది.
ఆరేబియా సముద్రంలో తుఫాను హరికేన్‌గా మారి ఒమన్ నుంచి భారత్ వైపు కదులుతోందని ఈ తుఫానుకు ‘క్యార్’ అని నామకరణ చేసినట్టుగా అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్రరూపం దాల్చుతుందని దాని ప్రభావంతో గంటకు 85 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మహా తీవ్ర తుఫాను గురువారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతాల్లో ఆరేబియా సముద్రం దానిని ఆనుకొని ఉన్న లక్షదీవుల ప్రాంతంలోని ఉత్తర ఈశాన్య దిశగా 130 కి.మీల, కోజికోడ్ (కేరళ)కి పశ్చిమ వాయువ్యదిశగా 340 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో అది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈనేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా గాలులు వీస్తాయని.. ఆ కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. కేరళ,తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కేరళ,ఎర్నాకుళం, త్రిసూర్,మలప్పురం,కోజికోడ్ జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు.