Abdul Salam Bhuttavi Dead: ముంబై పేలుళ్లకు కుట్ర పన్నిన కరుడుగట్టిన ఉగ్రవాది మృతి, జైల్లోనే చనిపోయినట్లు వార్తలు, ధృవీకరించిన ఐక్యరాజ్యసమితి
2008లో ముంబయి దాడుల తర్వాత దాదాపు ఏడాది పాటు సయీద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో లష్కరే తోయిబా చీఫ్‌గా సలాం భుట్టవి వ్యవహరించాడు.
Lahore, JAN 12: ముంబయి ఉగ్రదాడి (26/11) సూత్రధారి, లష్కరే తోయిబా (LET) డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ సలాం భుట్టవి (Hafiz Abdul Salam Bhuttavi) మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి ధ్రువీకరించింది. పాకిస్థాన్‌లోని మార్కడే జైలులో ప్రభుత్వ కస్టడీలో ఉన్న అతడు.. గతేడాది మే 29న గుండెపోటుతో మరణించినట్లు యూఎన్ భద్రతామండలి అల్‌ఖైదా ఆంక్షల కమిటీ తాజాగా వెల్లడించింది. ఉగ్ర సంస్థలో భుట్టవికి కీలక వ్యక్తిగా పేరుంది. అత్యవసర పరిస్థితుల్లో సొంతగా నిర్ణయాలు తీసుకొని ఉగ్రవాదులకు మార్గనిర్దేశం చేసేవాడు. ఆ సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌ను (Hafiz Saeed) నిర్బంధించిన రెండుమూడు సందర్భాల్లో కార్యకలాపాలను ఇతడే ముందుండి నడిపించాడు. 2008లో ముంబయి దాడుల తర్వాత దాదాపు ఏడాది పాటు సయీద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో లష్కరే తోయిబా చీఫ్‌గా సలాం భుట్టవి వ్యవహరించాడు.
ముంబయి దాడికోసం ఉగ్రవాదులను సిద్ధం చేయడంలో భుట్టవి ప్రమేయం ఉందని, రెచ్చగొట్టే ఉపన్యాసాలతో వారిని సామాన్య ప్రజలపైకి ఉసిగొలిపాడంటూ భారత్ పలుమార్లు ఆరోపించింది. ఉగ్ర కార్యకలాపాల నిర్వహణతోపాటు సంస్థలోని మదర్సా నెట్‌వర్క్ బాధ్యతలు స్వయంగా పర్యవేక్షించేవాడు. 2002లో లాహోర్‌లో లష్కరే తోయిబా సంస్థాగత స్థావరాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వ కస్టడీలోనే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మొత్తం 7 ఉగ్ర దాడులకు సంబంధించిన కేసుల్లో అతడు 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2020 ఫిబ్రవరి 12 నుంచి సయీద్ కారాగారంలో ఉన్నట్లు యూఎన్ తెలిపింది. అనేక ఉగ్రవాద కేసుల్లో దర్యాప్తు చేయాల్సి ఉన్నందున సయీద్‌ను అప్పగించాలని భారత ప్రభుత్వం డిసెంబర్‌లో పాకిస్థాన్‌ను కోరిన సంగతి తెలిసిందే.