Srinagar Encounter: జమ్మూకశ్మీర్ ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబా కమాండర్ హతం, ఆపరేషన్ పూర్తయిందని ప్రకటించిన అధికారులు
ఎన్‌కౌంటర్‌లో మరణించిన లష్కరే తాయిబా కమాండర్‌కు 2023లో జరిగిన ఇన్‌స్పెక్టర్ మస్రూర్ హత్య కేసుతో సంబంధం ఉందని ఐజీపీ బర్డీ చెప్పారు.
Srinagar, NOV 02: జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ నగర పరిధిలోని ఖన్యార్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో (JK Encounter) లష్కరే తాయిబా కమాండర్ మరణించాడని కశ్మీర్ జోన్ ఐజీపీ విద్ది కుమార్ బర్డీ (Viddi kumar) తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన లష్కరే తాయిబా కమాండర్‌కు 2023లో జరిగిన ఇన్‌స్పెక్టర్ మస్రూర్ హత్య కేసుతో సంబంధం ఉందని ఐజీపీ బర్డీ చెప్పారు. శనివారం ఉదయం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు భద్రతా జవాన్లు గాయపడ్డారని వెల్లడించారు.
‘ఇప్పుడు ఆపరేషన్ పూర్తయింది. భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాది పేరు ఉస్మాన్ అని, ఆయన లష్కరే తాయిబా కమాండర్. ఆయన విదేశీ ఉగ్రవాది. ఇన్‌స్పెక్టర్ మస్రూర్ హత్యతో ఆయనకు సంబంధం ఉంది’ అని ఐజీపీ బర్డీ తెలిపారు. అనంత నాగ్ ఎన్ కౌంటర్ మీద ఆయన స్పందిస్తూ.. ‘మాకు అందిన ఇన్ పుట్స్ మేరకు సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించాం. ఈ ఆపరేషన్ లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు’ అని తెలిపారు.