Assembly Elections Results 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, కాషాయ సునామిలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..

ఈ కూటమి 45 స్థానాల్లో విజయం సాధించింది. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్‌ 15, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) 10 సీట్లు గెలిచాయి.

Maharashtra Assembly Election Result 2024 (Photo Credits: LatestLY)

Mumbai, Nov 24: గత కొంత కాలంగా మహారాష్ట్రతో పాటు, దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర ఫలితాలు ఎట్టకేలకు వచ్చేశాయి. ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది! అక్కడ ఏకంగా 48 లోక్‌సభ సీట్లు ఉంటే బీజేపీకి తొమ్మిదికే పరిమితమైంది. దాంతో, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంవీఏ పైచేయి సాధిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి.అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ కాషాయ పార్టీ సునామితో దూసుకెళ్లింది.

మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 సీట్ల మార్కును కూడా కాంగ్రెస్ కూటమి దాటలేదు. ఈ కూటమి 45 స్థానాల్లో విజయం సాధించింది. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్‌ 15, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) 10 సీట్లు గెలిచాయి.

మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో 288 అసెంబ్లీ సీట్లలో 230 సీట్లతో తిరిగి అధికారంలోకి వచ్చింది, అధికారాన్ని చేజిక్కించుకోవాలనే కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కలను పంక్చర్ చేసింది.ఎన్నికల్లో ఆరు ప్రధాన పార్టీలు పోటీ పడితే.. కాంగ్రెస్‌ ఐదో స్థానంలో నిలిచింది! ఇంకా చెప్పాలంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్లతో పోల్చినా మూడో వంతుకు పడిపోయింది! ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది!

కూటమిలోని బీజేపీ 149 స్థానాల్లో బరిలోకి దిగి ఏకంగా 132 స్థానాల్లో గెలిచింది. అంటే.. దాదాపు 90 శాతం విజయాన్ని (స్ట్రైక్‌ రేట్‌) సాధించింది. కూటమిలోని ఏక్‌నాథ్‌ షిండే శివసేన పార్టీ 81 స్థానాల్లో పోటీ చేసి 57 సీట్లను దక్కించుకుంటే.. అజిత్‌ పవార్‌ ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేసి 41 సీట్లలో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాఢీ (ఎంవీఏ)కూటమిలోని మూడు పార్టీలకు వచ్చిన సీట్లను కలిపినా అర్ధ సెంచరీ దాటలేదు.

మహారాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం మొత్తం 288 సీట్లలో 10 శాతం లేదా 29 సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే ఎంవీఏలోని ఏ పార్టీ కూడా ఆ మేరకు సీట్లు గెలువలేదు. దీంతో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి ఏ పార్టీ కూడా అర్హత సాధించలేదు. ఈ నేపథ్యంలో ఎంవీఏ కూటమి ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. అలాగే ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) తమ నిజమైన పార్టీల ఉనికిని కూడా కోల్పోయాయి.

మహాయుతి హవాలో చిన్న పార్టీలు సైతం కొట్టుకుపోయాయి. రాజ్‌ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్‌ఎస్‌ 125 స్థానాల్లో, ప్రకాశ్‌ అంబేద్కర్‌ నాయకత్వంలోని వీబీఏ 200 నియోజకవర్గాల్లో పోటీ చేయగా ఒక్క చోటా విజయం సాధించలేదు. రాజ్‌ ఠాక్రే కుమారుడు అమిత్‌ ఠాక్రే ఓడిపోయారు. 17 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం మాలేగావ్‌ సెంట్రల్‌ స్థానంలో మాత్రమే 75 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది.

ఇదిలా ఉంటే బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇంకా 20 సీట్లు మాత్రమే అవసరం. ఈ పరిస్థితుల్లో కూటమి పార్టీలైన ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీలు ముఖ్యమంత్రి పీఠాన్ని డిమాండ్‌ చేసే పరిస్థితిలో లేవు. అయితే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకే సీఎం పదవి దక్కాలన్న ఫార్ములా ఏదీ లేదని సీఎం షిండే వ్యాఖ్యానించడం గమనార్హం.