'MAHA' Twist: 24 గంటల్లోగా బలం నిరూపించుకోవాలి, బల నిరూపణ జరగాల్సింది గవర్నర్ వద్ద కాదు అసెంబ్లీలో, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, కొనసాగుతున్న వాదనలు
24 గంటల్లోగా అసెంబ్లీలో బలపరీక్ష జరగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలో కానీ, గవర్నర్ వద్ద కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
New Delhi, November 25: మహారాష్ట్ర (Maharashtra) నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 24 గంటల్లోగా అసెంబ్లీలో బలపరీక్ష జరగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలో కానీ, గవర్నర్ వద్ద కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రాజ్‌భవన్ మెజారిటీని నిరూపించజాలదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కేవలం అసెంబ్లీ మాత్రమే మెజార్టీని నిరూపిస్తుందని... శాసనసభలోనే బలపరీక్ష జరగాలని ఆదేశించింది.
ఫడ్నవిస్ ప్రభుత్వానికి (Maharashtra Chief Minister Devendra Fadnavis) అవసరమైనంత సంఖ్యాబలం ఉందా? అని ప్రశ్నించింది. ఫిరాయింపులను అడ్డుకోవాలంటే తక్షణమే బలపరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. అయితే, బలపరీక్షకు రెండు, మూడు రోజుల సమయం కావాలని సొలిసిటర్ జనరల్ (Solicitor General) సుప్రీంకోర్టును కోరారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి.
కాగా మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన తరఫున న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తున్నారు. శుక్రవారం రాత్రి 7 నుంచి శనివారం ఉదయం 5 గంటల్లోపు అంతా అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. మూడు పార్టీల ప్రభుత్వం ఏర్పడకుండా ఇలా వ్యవహరించారని ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు. రాష్ట్రపతి పాలన ఎత్తేయడం వెనుక దురుద్దేశం ఉందని చెప్పారు. వెంటనే బలపరీక్ష నిర్వహించాలని కోరారు. సీనియర్ సభ్యుడు ప్రొటెం స్పీకర్ గా ఉంటారని చెప్పారు.
అజిత్ పవార్ (Deputy Chief Minister Ajit Pawar) తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బీజేపీకి మద్దతు ఇవ్వాలనే అధికారాన్ని ఎన్సీపీ నేతలు అజిత్ పవార్ కు కల్పించారని చెప్పారు. ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. అజిత్ పవార్ ఇచ్చిన లేఖ ఆధారంగా గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించారని వివరించారు.