Delhi Excise Policy Case: మనీశ్ సిసోడియాకు ఎదురుదెబ్బ, మార్చి 17 వరకు ఈడీ కస్టడీ పొడిగించించిన రౌజ్ ఎవెన్యూ కోర్టు, సీబీఐ రిమాండ్‌పై విచారణ ఈ నెల 21కి వాయిదా
సీబీఐ (CBI) రౌజ్ ఎవెన్యూ కోర్టు(Delhi Rouse Avenue Court) వారం రోజుల పాటు సిసోడియా ఈడీ కస్టడీ పొడిగించింది.
New Delhi, Mar 10: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam Case)లో అరెస్టైన ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ( former Delhi Deputy Chief Minister) మనీశ్ సిసోడియా(Manish Sisodia)కు కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ (CBI) రౌజ్ ఎవెన్యూ కోర్టు(Delhi Rouse Avenue Court) వారం రోజుల పాటు సిసోడియా ఈడీ కస్టడీ పొడిగించింది.
ఈ సందర్భంగా ఈడీ తన వాదనలు వినిపించింది. సిసోడియాను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. వాదనలు విన్న ధర్మాసనం ఆయన్ను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో ఆయనది ప్రత్యక్ష పాత్రేనని ఈడీ తెలిపింది. నిపుణుల కమిటీ అభిప్రాయాలను పక్కనబెట్టి.. కొందరికి ప్రయోజనం చేకూర్చేలా నూతన మద్యం విధానాన్ని (Liquor Policy) రూపొందించారు. కొందరు హోల్‌సేల్ డీలర్లకు 12శాతం లాభం ఉండేలా పాలసీని తయారుచేశారు.
సిసోడియా (Manish Sisodia) ఆదేశాలతోనే దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు మా వద్ద ఆధారాలున్నాయి. ఈ మద్యం విధానంలోని కొన్ని అంశాలను మంత్రుల బృందం సమావేశంలో కనీసం చర్చించలేదు. అయినప్పటికీ పాలసీని ఆమోదించి అమల్లోకి తెచ్చారు. అలా వచ్చిన అక్రమ సొమ్మును హవాలా ఛానళ్ల ద్వారా దారి మళ్లించారు.
ఈ మనీలాండరింగ్ (Money Laundering)లో సిసోడియా కూడా ఓ భాగమే’’ అని కోర్టుకు ఈడీ వివరించింది. ఈ దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారం సిసోడియా ఫోన్ అని.. అయితే దాన్ని ఆయన ధ్వంసం చేశారని ఈడీ (ED) న్యాయస్థానానికి తెలిపింది. ఆయన విచారణకు సహకరించలేదని ఆరోపించిన ఈడీ.. 10 రోజులు కస్టడీకి అప్పగించాలని కోరింది.
ఇప్పటివరకూ ఆయన సీబీఐ రిమాండ్‌లో ఉన్నారు. సీబీఐ రిమాండ్‌పై విచారణ ఇప్పటికే ఈ నెల 21కి వాయిదా పడగా తాజాగా న్యాయస్థానం ఆయన్ను వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. మనీశ్ సిసోడియాతో పాటు కలిపి విచారించేందుకు ఇప్పటికే ఏడుగురికి నోటీసులు జారీ చేశామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు తెలిపారు.
కవితకు, సిసోడియాకు ఉన్న వ్యాపార సంబంధాలపై ప్రశ్నిస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. కవిత, సిసోడియా, విజయ్ నాయర్ కుట్రకు పాల్పడ్డారని, సౌత్ గ్రూప్ ద్వారా రూ. 100 కోట్లు ఆప్‌కి చెల్లించారని ఈడీ పేర్కొంది. సిసోడియా వాడిన ఫోన్లు, సిమ్ కార్డులు అతని పేరుపై లేవని.. తద్వారా సాక్ష్యాధారాలు లేకుండా చేయాలనుకున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివరించారు.
మద్యం హోల్‌సేల్ వ్యాపారాన్ని కొందరికి మాత్రమే దక్కేలా కుట్రపూరితంగా లిక్కర్ పాలసీని అమలు చేశారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కుట్రను విజయ్‌నాయర్, సౌత్ గ్రూపు కలిసి కోఆర్డినేట్ చేశారని, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ జరిగిందని ఈడీ పేర్కొంది. సిసోడియా తరపున విజయ్ నాయర్ ఈ వ్యవహారం నడిపారని.. ఈ వ్యవహారంపై కవిత, సిసోడియా మధ్య అవగాహన ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివరించారు. 12 శాతం డీలర్ కమీషన్ అనే క్లాజ్‌ను పాలసీలో ఏకపక్షంగా చేర్చారని, ఇందులో మనీష్ సిసోడియా పాత్ర ప్రత్యక్షంగా ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు.