Bombay High Court: అత్త ఇంట్లో ఇంటి పని చేయడం క్రూరత్వం ఎలా అవుతుంది, దాన్ని పనిమనిషితో పోల్చడం ఎలా అనుకుంటారు, అత్తా మామలపై కోడలు పెట్టిన గృహహింస కేసును కొట్టివేసిన బాంబై హైకోర్టు
పెండ్లయిన మహిళను కుటుంబం కోసం పని చేయాలనడం పనిమనిషితో సమానంగా చూడటం కాదని, అది క్రూరత్వం (Household Work for Family Not Cruelty) కిందకు రాదని బాంబే హైకోర్టుకు (Bombay High Court) చెందిన ఔరంగాబాద్ బెంచ్ తీర్పు చెప్పింది.
Mumbai, Oct 28:పెండ్లయిన మహిళను కుటుంబం కోసం పని చేయాలనడం పనిమనిషితో సమానంగా చూడటం కాదని, అది క్రూరత్వం (Household Work for Family Not Cruelty) కిందకు రాదని బాంబే హైకోర్టుకు (Bombay High Court) చెందిన ఔరంగాబాద్ బెంచ్ తీర్పు చెప్పింది. ఇంటి పనులు చేయమని చెప్పినంతనే పనిమనిషితో పోల్చడం సరికాదని చెబుతూ విడిపోయిన భర్త, అతడి తల్లిదండ్రులపై పెట్టిన గృహహింస కేసును కోర్టు కొట్టివేసింది.నిందితులపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కూడా కొట్టివేసింది.న్యాయమూర్తులు విభా కంకణ్‌వాడీ, రాజేశ్ పాటిల్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. పెళ్లయిన నెల రోజుల తర్వాత భర్త తనను పనిమనిషిలా చూడడం ప్రారంభించాడని, కారు కొనుక్కునేందుకు రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతోపాటు మానసికంగా, భౌతికంగా ఎంతో వేధించాడని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ కేసును తాజాగా విచారించిన న్యాయస్థానం.. పెళ్లయిన మహిళను ఇంటి పనులు చేయమని అడగడం అంటే అది కచ్చితంగా కుటుంబం కోసమే అవుతుందని, దానిని పనిమనిషి చేసే పనితో పోల్చడం సరికాదని పేర్కొంది. ఇంటి పనులు చేయడం ఆమెకు ఇష్టం లేకుంటే ఆ విషయాన్ని పెళ్లికి ముందే చెప్పి ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది.
తనను మానసికంగా, భౌతికంగా వేధించారని ఫిర్యాదుదారు ఆరోపించినప్పటికీ అందుకు తగిన ఆధారాలను చూపించలేకపోయారని పేర్కొన్న న్యాయస్థానం.. సెక్షన్ 498ఎ ఈ కేసుకు వర్తించదని స్పష్టం చేస్తూ భర్త, అతడి తల్లిదండ్రులపై పెట్టిన గృహహింస కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. తనను వేధిస్తున్నారని పలు ఆరోపణలు చేసిన మహిళ స్పష్టంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయిందని ధర్మాసనం అభిప్రాయపడింది.
కుటుంబం కోసం పనిచేయమనడం పనిమనిషిలా చూడటం ఎలా అవుతుందని ప్రశ్నించింది. ఒకవేళ ఇంటిపని చేయడం ఇష్టం లేకపోతే సదరు మహిళ పెండ్లికి ముందే ఆ సంగతి చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. మానసికంగా, శారీరకంగా వేధించారని అంటే 498ఏ కేసు పెట్టేందుకు సరిపోదని స్పష్టం చేసింది.