MHA Extends COVID Guidelines: థర్డ్ వేవ్ అలర్ట్, కరోనా గైడ్‌లైన్స్ సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగింపు, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర హోంశాఖ
కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశం మొత్తమ్మీద కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతానికి స్థిరంగా ఉందని పేర్కొన్నారు.
New Delhi, August 29: భారతదేశంలో కోవిడ్–19 మార్గదర్శకాల అమలును మరో నెలపాటు, సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు (MHA Extends COVID Guidelines) కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశం మొత్తమ్మీద కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతానికి స్థిరంగా ఉందని పేర్కొన్నారు.
అందుకే, రానున్న పండగల సీజన్ సమయంలో ప్రజలు ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. అవసరమైతే స్థానికంగా ఆంక్షలను అమలు చేయాలని స్పష్టం చేశారు. జనసమ్మర్ధం ఉన్నచోట్ల కోవిడ్ ప్రొటోకాల్స్ అమలు చేయాలన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది కోవిడ్ టీకా వేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 45,083 కరోనా పాజిటివ్ కేసులు (COVID19 India reports 45,083 new cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరింది. ఇందులో 3,18,87,642 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 3,68,558 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కరోనా వల్ల 4,37,830 మంది బాధితులు మరణించారు. శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 35,840 మంది కరోనా నుంచి బయటపడ్డారని, మరో 460 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 97.53 శాతంగా ఉందని తెలిపింది.