Monsoon Session of Parliament: వ్యాక్సిన్ తీసుకుని అందరూ బాహుబలులయ్యారు, విపక్షాల ఆందోళన మధ్య ప్రసంగాన్ని కొనసాగించిన ప్రధాని మోదీ, ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
పార్లమెంట్ సమావేశాలకు (Monsoon Session of Parliament) ముందు ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను సభ్యులందరూ అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాలు పత్యక్షంగా జరపటం సంతోషకరమన్నారు. లోక్‌సభలో విపక్షాల ఆందోళన మధ్యే ప్రధాని మోదీ ( PM Narendra Modi) తన ప్రసంగాన్ని కొనసాగించారు.
New Delhi, July 19: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ సమావేశాలకు (Monsoon Session of Parliament) ముందు ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను సభ్యులందరూ అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాలు పత్యక్షంగా జరపటం సంతోషకరమన్నారు. లోక్‌సభలో విపక్షాల ఆందోళన మధ్యే ప్రధాని మోదీ ( PM Narendra Modi) తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేబినెట్‌లో ఎస్సీలు, మహిళల ప్రాతినిధ్యం శుభపరిణామమన్నారు. విపక్ష ఎంపీలు పదునైన ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నాను. అలానే ప్రభుత్వానికి సమాధానం చెప్పేందుకు తగిన సమయం ఇవ్వాలని ఆశిస్తున్నాను’’ అన్నారు.
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విపక్షాలు ఇంధన ధరల పెంపు, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసన వంటి వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ మిమ్మల్ని బాహుబలిగా మారుస్తుంది.. కనుక ప్రతి ఒక్కరు టీకా వేసుకోవాలని నరేంద్ర మోదీ అభ్యర్థించారు. అలానే ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ‘‘భుజాలకు టీకా తీసున్నవారంతా బాహుబలిగా మారతారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్క డోస్ టీకా అయినా తీసుకుని బాహుబలులుగా మారారు. వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. దీని గురించి పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరగాలని ఆశిస్తున్నానని మోదీ అన్నారు.
దేశానికి చెందిన దళితులు, మహిళలు, ఓబీసీలు మంత్రులు అయితే, ప్రతిపక్షాలకు సంతోషంగా లేదని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో ఉత్సాహ వాతావరణం ఉంటుందని అనుకున్నానని, కొత్త మహిళా, దళిత ఎంపీలను స్వాగతిస్తున్నామని, ఎంపీలను పరిచయం చేయాలనుకున్నాని, కానీ కొందరికి మాత్రం దళిత ఎంపీలు మంత్రులు కావడం నచ్చడం లేదని ఆరోపించారు. పార్టీకి చెందిన వ్యవసాయ, గ్రామీణ నేపథ్యం ఉన్నవారు మంత్రులు అయినట్లు ప్రధాని చెప్పారు. మంత్రిమండలిలో ఓబీసీ వర్గం కూడా ఉందన్నారు. ప్రధాని మోదీ తన మంత్రిమండలి ప్రవేశపెడుతున్న సమయంలో విపక్షాలు అడ్డుకోవడాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తప్పుపట్టారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
అనంతరం ఇటీవల మరణించిన ఎంపీలకు లోక్‌సభ సంతాపం తెలిపింది. రాజ్యసభలో ఇటీవల మరణించిన మాజీ ఎంపీలకు సభ్యులు నివాళులు అర్పించారు. ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ మృతిపై రాజ్యసభ సంతాపం తెలిపింది. అనంతరం మధ్యాహ్నం 12:24 వరకు రాజ్యసభ వాయిదా పడింది. పోలవరం అంచనా వ్యయం ఆమోదించాలని వైఎస్సార్ సీపీ.. పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్.. వ్యాక్సినేషన్, ఆర్ధిక వృద్ధి పతనంపై టీఎంసీ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలను విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల ఆందోళనలతో మధ్యాహ్నం 2 వరకు లోక్‌సభ వాయిదా పడింది.
పార్లమెంట్ వద్ద రైతు చట్టాలకు వ్యతిరేకంగా అకాలీదళ్ ఎంపీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. లోక్‌సభలో ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన నలుగురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ప్రధాని మోదీ కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు.