New Delhi, July 19: దేశంలో తాజాగా 38,164 కొత్త కేసులు (COVID in India) వెలుగుచూశాయి. ఇక మరణాల సంఖ్య 500 దిగువకు చేరడం కాస్త ఊరట కలిగించే విషయం. ఏప్రిల్ 5 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో మరణాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ఇక క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 7.2 శాతం తగ్గుదల (Death Rate) కనిపించింది. 499 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటివరకు దేశంలో 3.11కోట్లమందికి పైగా వైరస్ (Coronavirus) బారినపడగా..4,14,108 మంది మహమ్మారికి బలయ్యారు.
అలాగే నిన్న 14,63,593 మంది నమూనాలను సేకరించి పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 44.54 కోట్లకు పైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పింది. ప్రస్తుతం 4,21,665 మంది కరోనాతో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.35 శాతానికి చేరగా.. రికవరీ రేటు 97.32 శాతంగా ఉంది. అలాగే నిన్న 38,660 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.03కోట్ల మార్కును దాటాయి. ఇక నిన్న 13.63లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసులు సంఖ్య 40.64కోట్లకు చేరింది.
కరోనా థర్డ్‌వేవ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఐసీఎంఆర్ కీలక సూచనలు చేసింది. నెలరోజుల వ్యవధిలో ఏదైనా జిల్లాలోని 75 శాతం మందికి వ్యాక్సినేషన్ (కనీసం ఒక్క డోసు) పూర్తిచేస్తే.. మరణాలను 37 శాతం వరకు, కేసులను 26 శాతం వరకు తగ్గించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఐసీఎంఆర్ చేసిన అధ్యయనం వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.