New Delhi, January 26: కరోనా వ్యాక్సిన్ల రేట్లు(Vaccines Price) భారీగా తగ్గనున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కోవిషీల్డ్ (Covishield), కోవాగ్జిన్ (Covaxin) ధరలు దిగిరానున్నాయి. కరోనా వైరస్ వ్యాధి నిరోధక కోవిడ్ వ్యాక్సిన్‌లను సరసమైన ధరలకు అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. దీంతో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు ఒక్కో డోస్‌కి రూ.275 మేర పరిమితం చేసే అవకాశమున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే సర్వీస్ ఛార్జీ (additional service charge) రూ.150 అదనంగా ఉంటుందని వెల్లడించాయి. డ్రగ్ రెగ్యులేటర్ (Drug Regulator) నుండి సాధారణ మార్కెట్ ఆమోదం కోసం ఈ రెండు వ్యాక్సిన్ తయరీ సంస్థలు వేచి ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ ధరలను పరిమితం చేసే పనిని ప్రారంభించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (National Pharmaceutical Pricing Authority ) ఇప్పటికే ఆదేశించినట్లు చెప్పాయి.
ప్రస్తుతం భారత్ బయోటెక్(Bharath biotech) ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్(Covaxin) ప్రతి డోస్ ధర రూ. 1,200 కాగా, సీరం ఇన్‌స్టిట్యూట్ కోవిషీల్డ్(Covisheid) ధర ప్రైవేటు సంస్థలకు రూ.780గా ఉన్నది. రూ. 150 సర్వీస్ ఛార్జీ కూడా ఈ ధరలోనే కలిపి ఉంది. అయితే కొన్ని షరతులకు లోబడి వయోజన జనాభాలో ఉపయోగించడానికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు రెగ్యులర్ మార్కెట్ ఆమోదం ఇవ్వాలని ఈ రెండు ఫార్మా సంస్థలు దరఖాస్తు చేశాయి. మరోవైపు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (Central Drugs Standards Control Origination) కోవిడ్ -19 సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ కూడా ఈ నెల 19న దీనికి సిఫార్సు చేసింది.
ఈ పరిణామం నేపథ్యంలో వ్యాక్సిన్‌ల ధరను తగ్గించేందుకు ఎన్పీపీఏ ప్రయత్నిస్తున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఒక్కో డోసుకు రూ. 150 అదనపు సర్వీస్ ఛార్జీతో పాటు టీకా ధర రూ. 275కి పరిమితం చేసే అవకాశం ఉన్నదని వెల్లడించాయి.