Morbi Bridge Tragedy: కూలిన కేబుల్ బ్రిడ్జిపై షాకింగ్ విషయాలు, రూ.2 కోట్లతో రిపేర్ చేసిన 4 రోజులకే కుప్పకూలిన వంతెన, గతంలో ఇదే నదిపై ఘోర ప్రమాదం
ఉన్నట్టుండి ఈ బ్రిడ్జి తెగిపోవడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు నదిలో పడిపోయారు.
Morbi, Oct 31: గుజరాత్‌లో మోర్బీ జిల్లాలోని ప్రాంతంలో మచ్చు నదిపైనున్న కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలిన (Morbi Suspension Bridge Collapse) సంగతి విదితమే. ఉన్నట్టుండి ఈ బ్రిడ్జి తెగిపోవడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు నదిలో పడిపోయారు. బ్రిడ్జి కూలిన ఘటనలో (Morbi Suspension Bridge Tragedy) మృతుల సంఖ్య 132కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు.
ప్రమాద సమయంలో (Gujarat Suspension Bridge Tragedy) వంతెనపై దాదాపు 500 మందికి పైగా ఉన్నట్లు బయటకు వచ్చిన వీడియోలు చూస్తే తెలుస్తోంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పలుపంచుకుంటున్నారని చెప్పారు.
ఈ కేబుల్ వంతెన 140 ఏళ్ల క్రితం 1879 ఫిబ్రవరి 20న అప్పటి ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ ప్రారంభించగా..దీని నిర్మాణం 1880లో పూర్తయింది. ఇందుకు అప్పట్లోనే రూ.3.5 లక్షలు ఖర్చయ్యాయి. వంతెన పొడవు 765 అడుగులు (233 మీటర్లు). వెడల్పు 1.25 మీటర్లు. దీని నిర్మాణానికి అవసరమైన సామగ్రిని ఇంగ్లండ్ నుంచి తెప్పించారు. నాటి మోర్బీ పాలకుడు సర్ వాగ్జీ ఠాకూర్ అప్పట్లో యూరప్‌లో ఉన్న అత్యాధునిక పరిజ్ఞానాలను రంగరించి దీన్ని కట్టించాడు. ఇది మోర్బీ పట్టణంలోని దర్బార్‌గఢ్, నజార్‌బాగ్ ప్రాంతాలను అనుసంధానిస్తుంది. దీన్ని చారిత్రక వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చారు.
అయితే ఈ బ్రిడ్జికి ఈ మధ్యే మరమ్మతులు చేయడంతో పాటు ఆధునీకరించారు. దాదాపు రూ.2 కోట్లతో 7 నెలలకు పైగా పనులు జరిగాయి.గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 26వ తేదీన రీ ఓపెన్ చేసి సందర్శకులను అనుమతించారు. అనంతరం నాలుగు రోజులకే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మరమ్మతుల తర్వాత వంతెనకు మున్సిపాలిటీ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇంకా అందలేదని అధికారులు తెలిపారు.వంతెన ఏ మేరకు సురక్షితమన్న అంశం గుజరాత్ అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. దీని పటిష్టతపై పలువురు ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేయగా ప్రభుత్వం అంతా సవ్యంగానే ఉందంటూ బదులిచ్చింది.
మోర్బీలోని మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.ఈ ఘటనలో మరణించిన వారికి గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, కేంద్రం రూ.2 లక్షలు ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించింది. ఇక మోదీ అహ్మదాబాద్‌లో తలపెట్టిన రోడ్ షోను ప్రమాదం నేపథ్యంలో రద్దు చేసుకున్నారు.
ఇదిలా ఉంటే 1979లో మోర్బీ పట్టణంలో ఇదే మచ్చూ నదిపై ఘోర ప్రమాదం జరిగింది.1979 ఆగస్టు 11న మోర్బీ సమీపంలోని మచ్చూ–2 డ్యామ్ తెగిపోయింది. దాంతో పట్టణాన్ని భారీ వరద ముంచెత్తింది. ఈ విషాదంలో 2,000 మందికిపైగా చనిపోయారు. సౌరాష్ట్రలో కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించడానికి ఈ డ్యామ్‌ను 1972లో నిర్మించారు.