Morbi Bridge Tragedy: బీజేపీ ఎంపీ కుటుంబంలో 12 మందిని మింగేసిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం, మచ్చు నదిలో కూలిన తీగల వంతెన ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య
ఈ ప్రమాదంలో రాజ్‌కోట్ బీజేపీ ఎంపీ అయిన మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందరియా కుటుంబానికి చెందిన 12 మంది మృతి (12 members of Rajkot BJP MP Mohanbhai Kalyanji Kundariya's family) చెందారు.
Rajkot, Oct 31: గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం (Morbi Bridge Tragedy) రాజ్‌కోట్ ఎంపీ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాజ్‌కోట్ బీజేపీ ఎంపీ అయిన మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందరియా కుటుంబానికి చెందిన 12 మంది మృతి (12 members of Rajkot BJP MP Mohanbhai Kalyanji Kundariya's family) చెందారు. వారంతా తన సోదరి కుటుంబానికి చెందినవారని కుందరియా చెప్పారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారన్నారు.
మోర్బీలో మచ్చునదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలిన (Morbi bridge collapse) విషయం తెలిసిందే. ఇప్పటివరకు 132 మంది మరణించగా, 117 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 19 మంది గాయపడ్డారు. మిగిలినవారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైనవారికోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, స్థానిక సిబ్బంది రెస్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని ఎంపీ చెప్పారు. మచ్చు నదిలో మునిగిపోయినవారి మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పలుపంచుకుంటున్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై దాదాపు 500 మందికిపైగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.బ్రిడ్జిని తెరవడానికి ఎలా అనుమతి ఇచ్చారని బీజేపీ ఎంపీని ప్రశ్నించగా.. ఈ విషాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుపుతామని, బాధ్యులను శిక్షిస్తామని, మృతుల్లో మహిళలు, పిల్లలు, స్థానికులు, ఎన్జీవోలు ఎక్కువగా ఉన్నారని చెప్పారు.
గుజరాత్ రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి రాష్ట్ర రాజధానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోర్బీలో విలేకరులతో మాట్లాడుతూ, కూలిపోవడంపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కూలిన ఘటనలో సెక్షన్‌లు 304 (అపరాధపూరితమైన నరహత్య కాదు హత్య), 308 (ఉద్దేశపూర్వక చర్య మరణానికి కారణమైంది) మరియు 114 (నేరం జరిగినప్పుడు ప్రేరేపకుడు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సంఘవి తెలిపారు.
మృతులకు, క్షతగాత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. విలేకరుల సమావేశంలో హర్ష సంఘవి మాట్లాడుతూ.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 132 మంది మరణించారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో వంతెన కూలిపోయింది. దీపావళి సెలవులు, ఆదివారం కావడంతో ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన వంతెనపై పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉందని తెలిపారు.