Mukhtar Ansari Hospitalized: జైల్లోనే కుప్పకూలిన గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ, ఐసీయూలో చికిత్స అందిస్తున్న జైలు సిబ్బంది, తన ప్రాణాలకు ముప్పు ఉందని గతంలో పలుమార్లు లేఖలు
దీంతో అతనికి చికిత్స అందించేందుకు జైలు నుంచి బందా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అన్సారీకి ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Lucknow, March 26: ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari) ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతనికి చికిత్స అందించేందుకు జైలు నుంచి బందా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అన్సారీకి ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపధ్యంలో పోలీసులు మెడికల్ కాలేజీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల క్రితం ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari) తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు. ముక్తార్ అన్సారీ తనపై విషం ప్రయోగించేందుకు కుట్ర జరుగుతున్నదంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ ఉదంతంలో స్పందించిన కోర్టు అన్సారీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బందా జైలులోని జైలర్, ఇద్దరు డిప్యూటీ జైలర్లను సస్పెండ్ చేసింది. ఒక కేసులో ముఖ్తార్ అన్సారీ గత గురువారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే అదే సమయంలో అన్సారీ తనకు ప్రాణహాని ఉందంటూ న్యాయవాది ద్వారా న్యాయమూర్తికి లేఖ పంపారు.
మార్చి 19న తనకు ఇచ్చిన ఆహారంలో విషపూరితమైన పదార్థాలు కలిశాయని ముఖ్తార్ అన్సారీ ఆ లేఖలో రాశాడు. ఆ ఆహారం తిన్న తర్వాత తాను అస్వస్థతకు గురయ్యానని, తనకు చేతులు, కాళ్ల నరాల్లో విపరీతమైన నొప్పి వచ్చిందని ముఖ్తార్ అన్సారీ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆరోజు తాను చనిపోతానేమోనని భయపడ్డానని లేఖలో పేర్కొన్నాడు.
ఘాజీపూర్ నకిలీ ఆయుధాల లైసెన్స్ కేసులో ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి (ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు) అవ్నీష్ గౌతమ్ ముఖ్తార్ అన్సారీకి ఈ శిక్ష విధించారు. 2023లో జరిగిన ఒక హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. ముక్తార్‌కు ఇప్పటివరకు ఏడు కేసుల్లో శిక్ష పడింది. ఎనిమిదో కేసులో దోషిగా తేలాడు.