Nawab Malik Arrested: మనీలాండరింగ్ కేసులో మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్, మార్చి 3 వరకు ఈడీ కస్టడీకి అప్పగించిన కోర్టు, దావూద్ ఇబ్రహీంతో ఆర్థిక సంబంధాలున్నాయని ఆరోపణలు
కోర్టులో హాజరుపరిచిన అనంతరం మార్చి 3 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి కోర్టు అప్పగించింది. ముంబై ప్రత్యేక కోర్టు (Special PMLA Court) ఈ మేరకు పేర్కొంది.
Mumbai, February 23: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్ట్ (Nawab Malik Arrested) చేసింది. కోర్టులో హాజరుపరిచిన అనంతరం మార్చి 3 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి కోర్టు అప్పగించింది. ముంబై ప్రత్యేక కోర్టు (Special PMLA Court) ఈ మేరకు పేర్కొంది.
ఎన్సీపీ సీనియర్ నేత అయిన 62 ఏండ్ల నవాబ్ మాలిక్ ఇంటికి బుధవారం ఉదయం ఈడీ అధికారులు వెళ్లారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసుపై పలు గంటలపాటు ఆయనను ప్రశ్నించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ (Maharashtra Minister to ED Custody) వెల్లడించింది.
దావూద్, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను నవాబ్ మాలిక్ కొనుగోలు చేసినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో దావూద్‌సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని నిశితంగా ఈడీ పరిశీలిస్తోంది. ఇబ్రహీం కస్కర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత.. విచారణలో కీలక రహస్యాలను ఈడీకి వివరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ విషయాల ఆధారంగానే నవాబ్ మాలిక్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించినట్లు వివరించారు.
అయితే విచారణలో దావూద్ అక్రమ ఆస్తులు, కొద్ది రోజుల క్రితం అరెస్టయిన దావూద్ సోదరుడు ఇబ్రహీం కస్కర్‌తో సహా పలు అనుమానిత నిందితులతో సంబంధాలపై ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు మాలిక్ అరెస్ట్‌తో మహారాష్ట్రలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. కేంద్రం తీరుపై పలు పార్టీలు విమర్శలు గుప్పించాయి. మంత్రి అరెస్ట్ నేపథ్యంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఎన్‌సీపీ నేతలతో కీలక సమావేశానికి పిలుపునిచ్చారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. దాదాపు 10 నిమిషాల పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ వ్యవహారంపైనే వీరిద్దరూ చర్చించుకున్నారు. ఈ విషయంలో ఎలా వ్యవహరించాలన్న విషయంపై మమత సలహా తీసుకోవడం గమనార్హం. నారద స్కాంతో సంబంధమున్న మంత్రులను సస్పెండ్ చేశారా? అని శరద్ పవార్ ఆమెను అడిగినట్లు సమాచారం. అయితే… నవాబ్ మాలిక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కేబినెట్ నుంచి తొలగించవద్దని మమత స్పష్టం చేసినట్లు పవార్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో ఎన్సీపీకి మద్దతుగా తాముంటామని మమతా బెనర్జీ పవార్‌కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామా చేస్తారా? చేయరా? ప్రస్తుతం ఇదే చర్చ సాగుతోంది. దీనిపై ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్ స్పందించారు. మాట్లాడే వారి నోరుమూయించడం కోసమే ఈ అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. తాము న్యాయ పోరాటం చేస్తామని, అందులో ఆయన తప్పేమీ లేదని పేర్కొన్నారు. నవాబ్ మాలిక్ రాజీనామా చేయరని ఛగన్ భుజ్‌బల్ ప్రకటించారు.
ఇక నవాబ్ మాలిక్ రాజీమానాపై శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ కూడా స్పందించారు. మంత్రి పదవికి నవాబ్ మాలిక్ రాజీనామా చేయరని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మహా వికాస్ అగాఢీతో నేరుగా తలపడలేకే… అఫ్జల్ లాగా వెనక నుంచి వెన్నుపోటు పొడిచారు. మోసపూరితంగా మంత్రిని అరెస్ట్ చేసి పండగ చేసుకుంటున్నారు. మంత్రి పదవికి నవాబ్ మాలిక్ రాజీనామా చేయరు. మేం ఇలాగే పోరాడతాం. కంసుడు, రావణుడు కూడా చంపబడ్డారు. పోరాడుతూనే వుంటాం. ఇదే హిందుత్వ. జై మహారాష్ట్ర అంటూ రౌత ట్వీట్ చేశారు.