Sharad Pawar Visits Adani Office: అదానీ ఇంటికి శరద్ పవార్, ఫ్యాక్టరీని ప్రారంభించిన ఇద్దరు నేతలు, ఆసక్తికరంగా మారిన ఇరువురి భేటీ
వీరిద్దరూ కలిసి అహ్మదాబాద్ సనంద్‌లోని ఓ గ్రామంలో ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని అదానీ నివాసాన్ని, కార్యాలయాన్ని పవార్ సందర్శించారు.
Ahmadabad, SEP 23: ఎన్సీపీ (NCP)అధినేత శరద్‌పవార్ (Sharad Pawar)Sharad Pawar, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ( Gautam Adani)ని కలిశారు. వీరిద్దరూ కలిసి అహ్మదాబాద్ సనంద్‌లోని ఓ గ్రామంలో ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని అదానీ నివాసాన్ని, కార్యాలయాన్ని పవార్ సందర్శించారు. ఈ విషయాన్ని శరద్ పవార్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. అలాగే వీరిద్దరూ కలసి ఫ్యాక్టరీని ప్రారంభించిన ఫొటోను కూడా పంచుకున్నారు. అయితే వీరిద్దరి భేటీలో ఏయే అంశాలపై చర్చించారన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో శరద్ పవార్‌ను ముంబయిలోని ఆయన నివాసంలో గౌతమ్ అదానీ కలిసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు గంటలపాటు వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు సంబంధిత వర్గాలు అప్పట్లో వెల్లడించాయి.
అయితే అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) నివేదికపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్న సమయంలోనే ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు, అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకే తాను మొగ్గు చూపుతున్నట్లు పవార్ ఆ సమయంలో ప్రకటించారు. ఆ తర్వాత జూన్‌లో అదానీ మరో సారి పవార్‌ను కలిశారు.
పవార్, అదానీల మధ్య దాదాపు రెండు దశాబ్దాల బంధం ఉంది. 2015లో పవార్ ప్రచురించిన తన మరాఠీ ఆత్మకథ ‘లోక్ మేజ్ సంగటి’లో బొగ్గు రంగంలోకి అడుగుపెట్టిన అదానీపై పవార్ ప్రశంసలు కురిపించారు. తన పట్టుదలతోనే అదానీ థర్మల్ పవర్ రంగంలోకి అడుగుపెట్టారని అందులో తెలిపారు. అంతేకాకుండా సేల్స్‌మ్యాన్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన అదానీ తన కార్పొరేట్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారో పవార్ అందులో వివరించారు.