Prescription Must: జ్వరం, దగ్గు, జలుబు మందులు కావాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి! మెడికల్ స్టోర్ల యాజమాన్యాలకు ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
ఫార్మసీ స్టోర్స్ అసోసియేషన్, మెడికల్ షాపుల యాజమాన్యాలు, సంబంధిత ప్రతినిధులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు సమావేశమై శనివారమే స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు....
Hyderabad, April 19: రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇకపై ఎవరైనా నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి చేసే మందుల కొనుగోళ్లపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టింది. డాక్టర్ చీటి (Doctor Prescription) లేనిదే దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, జలుబు తదితర మెడిసిన్స్ ఇవ్వరాదని మెడికల్ షాప్స్ యాజమాన్యాలకు ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేస్తే వారి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ తప్పకుండా తీసుకోవాలని పేర్కొంది.
కోవిడ్-19 యొక్క ప్రాథమిక లక్షణాలు (COVID-19 Symptoms) అవే కావడంతో చాలా మంది తమకు కరోనా లక్షణాలు ఉన్నా ఇలాంటి ఔషధాలతో తాత్కాలికంగా తమ లక్షణాలను దాచిపెట్టి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పారాసిటమాల్, హెడ్రోక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ మందుల అమ్మకాలను ప్రభుత్వం నిలిపివేసింది. ఇటీవల కాలంలో ఎవరైనా వీటిని కొనుగోలు చేస్తే వారి వివరాలు ఇవ్వాల్సిందింగా మెడికల్ స్టోర్ యాజమాన్యాలను ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి, ఏం చేద్దాం? కేబినేట్ భేటీకి ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఎంతో పటిష్ఠంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నా, అన్నిరకాల వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకి కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చాలా మంది లక్షణాలు దాచిపెట్టి పరీక్షలు చేయించుకోకుండా ఉండిపోతున్నారు. న్యుమోనియా, తీవ్రమైన శ్వాసకోశ సంబంధమైన అనారోగ్యం మరియు ఇన్ ఫ్లుఎంజా వంటి అనారోగ్యం వంటి లక్షణాలు ఉన్నవారు వైద్యులను సంప్రదించకుండానే తమకు తాముగా ఔషధాలు తీసుకుంటున్నారు. ఈ తరహా చర్యలు తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తాయి కాబట్టి, ప్రభుత్వం ఇలాంటి వారిపై దృష్టిపెట్టింది. ఇది ప్రజల ప్రయోజనం కోసమేనని తెలిపింది.
ఈ మేరకు ఫార్మసీ స్టోర్స్ అసోసియేషన్, మెడికల్ షాపుల యాజమాన్యాలు, సంబంధిత ప్రతినిధులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు సమావేశమై శనివారమే స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.