Telangana CM K Chandrashekar Rao | File Photo

Hyderabad, April 19: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అమలు పరుస్తున్న విధానాలనే యధావిధిగా అమలు చేయాలని, లాక్‌డౌన్ వల్ల ఏ ఒక్కరు ఆకలితో అలమటించే పరిస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వైరస్ వ్యాప్తి నివారణ, రోగులకు అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ప్రగతి భవన్ లో శనివారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలను చర్చించారు. ఈ సమావేశానికి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కే.టీ.రామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, సీఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

‘‘దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి జరగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నందున అక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. కంటైన్మెంట్ జోన్ల నిర్వహణ బాగా జరగాలి. ఆ ప్రాంతాల్లో ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానీయవద్దు. రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారు నివసిస్తున్న ఇతర ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ వ్యూహం రూపొందిచుకోవాలి. వైరస్ సోకిన వారి ద్వారా ఇంకా ఎవరెవరికి సోకే అవకాశం ఉంది? అనే విషయాలను ఖచ్చితంగా నిర్థారించి పరీక్షలు జరపాలి. ఎంత మందికైనా పరీక్షలు జరపడానికి, ఎంత మందికైనా చికిత్స చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘లాక్ డౌన్ వల్ల పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దు. అందుకే ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులకు నగదు, బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది. వలస కూలీలు, రోజు వారి కార్మికులు ఇంకా ఎవరైనా మిగిలినా సరే, వారిని గుర్తించి తగిన సహాయం అందించాలి. వ్యవసాయ కార్యక్రమాలు యధవిధిగా జరిగేటట్లు చూడాలి. కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలి. ఈ సమయంలో ఎవరికి ఏ ఆపద, ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించే విధంగా ప్రభుత్వంలోని అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి’’ అని సీఎం సూచించారు.

ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి కేబినేట్ మీటింగ్ జరగనుంది. రాష్ట్రంలో కోవిడ్-19 తీవ్రత తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 20 అంటే రేపట్నించి లాక్డౌన్ ఆంక్షలను సడలించాలా? ఇప్పుడున్న ప్రకారమే కొనసాగించాలా? అనే విషయంపై మంత్రివర్గంతో చర్చించి సీఎం ఒక నిర్ణయానికి రానున్నారు.