Shaheen Bagh Mediation: 69 రోజుల తర్వాత పాక్షికంగా తెరుచుకున్న నోయిడా- ఫరీదాబాద్ రహదారి, షాహీన్ బాగ్ నిరసనలతో రెండు నెలలకు పైగా నిలిచిపోయిన రాకపోకలు

అదే ప్రాంతంలో నిరసన చేస్తేనే ఏమైనా ప్రభావం ఉంటుందని వారు ధృడంగా నమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) ను వెనక్కి తీసుకుంటే, తాము ఆ రహదారిని ఖాళీ చేయడమే కాకుండా పూర్తి శుభ్రం కూడా చేస్తామని చెబుతున్నారు....

Shaheen Bagh protests. (Photo Credit: PTI)

New Delhi, February 21: గత రెండు నెలల కాలంగా దిల్లీలోని షాహీన్ బాగ్‌లో (Shaheen Bagh) కొనసాగుతున్న సిఎఎ / ఎన్‌ఆర్‌సి వ్యతిరేక నిరసనల (Anti CAA/ NRC Protests)  కారణంగా మూతపడిన నోయిడా-ఫరీదాబాద్ రహదారి ఎట్టకేలకు 69 రోజుల తర్వాత తిరిగి తెరుచుకుంది . నిరసనకారులతో మాట్లాడేందుకు సుప్రీంకోర్ట్ జోక్యం చేసుకొని మధ్యవర్తులను (Mediators)  నియమించడంతో షాహీన్ బాగ్ నిరసనకారులు కాస్త బెట్టు దిగారు. దీంతో దిల్లీ పోలీసులు ఈ మార్గాన్ని పాక్షికంగా తెరవడంతో తిరిగి ఈ మార్గం గుండా రాకపోకలు ప్రారంభమయ్యాయి. నోయిడాను దిల్లీలోని కాలిండి కుంజ్ తో అనుసంధానించే ఈ మార్గం నగరవాసులకు ఎంతో కీలకమైంది. రెండు నెలలుగా సిఎఎ నిరసనకారులు ఈ ప్రధాన రహదారి గుండా రాకపోకలు నిరోధించడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పై ఇటీవల విచారణ చేపట్టిన కోర్ట్, షాహీన్ బాగ్ వద్ద రహదారిని దిగ్బంధించడంపై అపెక్స్ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది కానీ, ఆ కారణంగా ప్రజా రహదారిని నిర్భంధించడంను సుప్రీం తప్పుపట్టింది. నిరసన చేయదలుచుకుంటే మరో ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచించింది.

"నిరసన తెలిపడం ప్రజల ప్రాథమిక హక్కు. అయితే అందుకు హద్దులు ఉన్నాయి, నిరసన చేసే వారందరూ రోడ్లను అడ్డుకుంటూ పోతే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి" అంటూ నిలదీసిన కోర్ట్ నిరసనను ప్రత్యామ్నాయ ప్రదేశానికి మార్చాలని సూచించింది.

ఈక్రమంలోనే రెండు నెలలకు పైగా షాహీన్ బాగ్ వద్ద నిరసనలు చేస్తున్న నిరసనకారులతో చర్చలు జరపడానికి మధ్యవర్తులుగా ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వోకేట్లు సంజయ్ హెగ్డే మరియు సాధన రామచంద్రన్ లను నియమించింది. వీరు షాహీన్ బాగ్ రెండు నెలలుగా సిఎఎ వ్యతిరేక నిరసనలు చేస్తున్న ఆందోళనకారులతో వరుసగా రెండు, మూడు దఫాలుగా చర్చలు జరిపి, ఎట్టకేలకు వారి నిరసన కార్యక్రమాలను మరో ప్రత్యామ్నాయ చోటుకు మార్చుకునేలా ఒప్పించడంలో గురువారం కొంతమేర సఫలమవడంతో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం పాక్షికంగా ఆ రహాదారిని తెరిచారు.

అయినప్పటికీ, షాహీన్ బాగ్ నిరసనకారులు ఆ స్థలాన్ని విడిచిపెట్టేందుకు పూర్తి సిద్ధంగా లేరు. అదే ప్రాంతంలో నిరసన చేస్తేనే ఏమైనా ప్రభావం ఉంటుందని వారు ధృడంగా నమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) ను వెనక్కి తీసుకుంటే, తాము ఆ రహదారిని ఖాళీ చేయడమే కాకుండా పూర్తి శుభ్రం కూడా చేస్తామని చెబుతున్నారు.