Manu Bhaker: ఒలింపిక్స్ అలసట నుంచి రిలాక్స్ అవుతున్న మనూ భాకర్, షూటింగ్ పక్కన పెట్టి ఏం చేస్తుందో చూడండి
విశ్వ క్రీడల్లో రెండు కాంస్య పతకాల(Bronze Medals)తో చరిత్ర సృష్టించిన ఆమె యావత్ దేశం గర్వపడేలా చేసింది. ఒలింపిక్ విజేతగా స్వదేశంలో అడుగుపెట్టిన మను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనుంది.
New Delhi, AUG 16: ఈ సమయంలో ఆమె తన హాబీలపై గురి పెట్టనుంది. అలాగని ఒకటో రెండో ఉన్నాయనుకుంటే పొరపాటే. అవును.. మను హాబీల జాబితాలో మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ.. భరతనాట్యం.. ఇలా చాలానే ఉన్నాయండోయ్. ‘ఒలింపిక్స్ తర్వాత చిన్న బ్రేక్.. ఈ గ్యాప్‌లో మార్షల్ ఆర్ట్స్ (Martial Arts) నేర్చుకోవాలనుకున్నా. చిన్నప్పుడు కరాటే అంటే ఇష్టం. కానీ, అనుకోకుండా షూటింగ్ వైపు మళ్లాను. అయితే ఇప్పటికిప్పుడు మార్షల్ ఆర్ట్స్ సాధ్యం కాకపోవచ్చు. అందుకని నాకెంతో ఇష్టమైన గుర్రపు స్వారీ, స్కేటింగ్ నేర్చుకుంటా. వీటితో ఫిట్‌నెస్ మెరుగుపడుతుంది. ఇక భరతనాట్యం అన్నా కూడా నాకు ప్రేమనే. ఫ్రాన్స్‌లో కొన్ని రోజులు నేర్చుకున్నాను’ అని మను తెలిపింది.
టోక్యో ఒలింపిక్స్ వైఫల్యంతో పాఠాలు నేర్చిన మను భాకర్.. పారిస్‌లో పతక గర్జన చేసింది. మాజీ కోచ్ జస్పాల్ రానా (Jaspal Rana) సలహాలతో మెరుగైన భాకర్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో కంచు మోత మోగించింది. తద్వారా ఒకే విశ్వక్రీడల్లో రెండు పతకాలు కొల్లగొట్టిన భారత తొలి షూటర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత పోటీల్లో మను మూడో స్థానంతో దేశానికి తొలి మెడల్ అందించింది. అనంతరం సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ ఈవెంట్‌లో మళ్లీ సత్తా చాటిన ఆమె కాంస్యంతో మెరిసింది. ఒలింపిక్స్ కోసం సుదీర్ఘంగా శిక్షణ పొందిన మను మూడు నెలలు బ్రేక్ తీసుకోనుంది. దాంతో, అక్టోబర్‌లో ఢిల్లీ వేదికగా జరగనున్న షూటింగ్ వరల్డ్ కప్(shooting world cup 2024)లో ఆమె పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి.