World Youth Skills Day: నైపుణ్యం ఉన్న వారికే ప్రపంచంలో ఎక్కడైనా గిరాకీ, భారత్‌లో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి ఉండటం వల్లే కరోనాతో ధీటైన పోరాటం సాధ్యమైందన్న ప్రధాని మోదీ

నైపుణ్యం క‌లిగిన వ్య‌క్తి మాత్ర‌మే నేటి ప్ర‌పంచంలో ఎదుగుతార‌ని ఆయ‌న అన్నారు....

File image of Prime Minister Narendra Modi (Photo Credits: PIB)

New Delhi, July 15: ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం వార‌ణాసిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడ 'రుద్రాక్ష కేంద్రాన్ని' ప్రారంభించారు. ప్రాచీన వార‌ణాసి సంస్కృతి సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా నిర్మించిన ఈ కేంద్రంలో 108 ర‌కాల రుద్రాక్ష‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. రెండు అంత‌స్థుల ఈ కేంద్రాన్ని జపాన్‌ సహకారంతో 186 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో సిగ్రా వద్ద నిర్మించారు. ఈ కేంద్రాన్ని భారత్‌లో జ‌పాన్‌ రాయబారితో కలిసి మోదీ ప్రారంభించారు. మొత్తం 2.87 హెక్టార్ల‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు, ఒకేసారి 1200 మంది సంద‌ర్శించే అవ‌కాశం ఉంది.

ఇక, ఈరోజు 'ప్రపంచ యూత్ స్కిల్స్ డే' సందర్భంగా యువతనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. న‌వ‌త‌రంలో నైపుణ్యాలను అభివృద్ధి ప‌ర‌చ‌డం అనేది ఒక దేశీయ అవ‌స‌రంగా ఉంద‌ని మోదీ అన్నారు. అంతేకాకుండా నైపుణ్యాభివృద్ధి 'ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్' కు పునాదిగా ఉంటుందని పేర్కొన్నారు. 'స్కిల్ ఇండియా మిషన్' ద్వారా గ‌డ‌చిన ఆరు సంవ‌త్స‌రాలలో కలిగిన ప్ర‌యోజ‌నాలను స్పూర్థిగా తీసుకొని యువత మరింత ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

భార‌తీయ సంస్కృతిలో నైపుణ్యాల కు ఉన్న‌టువంటి ప్రాధాన్యాన్ని ప్ర‌ధాన మంత్రి నొక్కి చెప్పారు. వ‌డ్రంగులు, కుమ్మ‌రి కార్మికులు, లోహ శ్రామికులు, పారిశుధ్య శ్రామికులు, తోటల లో ప‌ని చేసేవారు, నేత కార్మికులు వంటి నైపుణ్యం క‌లిగిన వృత్తులకు త‌గిన మ‌ర్యాదను ఇవ్వాల‌ని అన్నారు.

ప్రస్తుత విద్యా వ్య‌వ‌స్థలో నైపుణ్యాలకు ప్రాముఖ్యం తగ్గిపోయిందని ప్ర‌ధాన మంత్రి అభిప్రాయపడ్డారు. చ‌దువు అనేది మనకు ఏం చేయాలనేది బోధిస్తే, నైపుణ్యం అనేది వాస్త‌విక కార్య‌నిర్వ‌హ‌ణలో మ‌న‌కు దారిని చూపిస్తుంద‌ని, 'స్కిల్ ఇండియా మిషన్' ప్రధాన ఉద్దేశ్యం ఇదేనని ప్ర‌ధాని తెలిపారు. ఇప్పటివరకు 1.25 కోట్ల యువ‌జ‌నులు ‘ప్ర‌ధానమంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌న’ లో భాగంగా శిక్ష‌ణను అందుకొని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.

నిత్య జీవితంలో నైపుణ్యాల అవ‌స‌రం ఎంత‌యినా ఉంద‌న్న ప్రధాని, నేర్చుకోవ‌డం అనే ప్ర‌క్రియ డబ్బు సంపాద‌నతోనే ఆగిపోకూడ‌ద‌న్నారు. నైపుణ్యం క‌లిగిన వ్య‌క్తి మాత్ర‌మే నేటి ప్ర‌పంచంలో ఎదుగుతార‌ని ఆయ‌న అన్నారు. వ్య‌క్తులకైనా, వ్యవస్థలకైనా ఇదే సూత్రం వ‌ర్తిస్తుంద‌ని మోదీ పేర్కొన్నారు. ప్ర‌పంచానికి తెలివైన, నేర్ప‌రులైన వారి సేవల అవసరం ఉంది. సాంకేతిక విజ్ఞానం శ‌ర‌వేగంగా మారుతూ ఉన్న కార‌ణంగా స‌రికొత్త నైపుణ్యాలకు భారీ గిరాకీ ఏర్ప‌డ‌బోతోంద‌ని, ఈ కార‌ణంగా స్కిల్, రీ-స్కిల్‌, అప్‌-స్కిల్ వేగాన్ని అందుకోవ‌ల‌సి ఉంద‌ని ఆయ‌న అన్నారు. దేశంలో నైపుణ్యం క‌లిగిన శ్రామిక శక్తి ఉండటం వల్లనే కరోనా మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా ఒక ధీటైన యుద్ధం చేయగలుగుతున్నామని మోదీ స్పష్టం చేశారు.