No Confidence Motion Against the Government: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం, లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న ఇండియా కూటమి, ఇప్పటికే విప్ జారీ చేసిన కాంగ్రెస్, ప్రతిపక్షాల బలాబలాలు ఎంతంటే?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులు గడిచినా సభ సజావుగా సాగడం లేదు.
New Delhi, July 26: మణిపూర్ అంశంపై (Manipur) చర్చకు ప్రధాని మోదీ (Modi) ముఖం చాటేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఇవాళ అవిశ్వాస తీర్మానం (no confidence motion) ప్రవేశపెట్టడానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులు గడిచినా సభ సజావుగా సాగడం లేదు. కేంద్రం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ మణిపూర్ తదితర ముఖ్యమైన అంశాలపై చర్చించకుండా ఉభయ సభలను రోజూ వాయిదా వేస్తూ వస్తున్నది. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండ గట్టేందుకు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడమే సరైనదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ విషయంపై విపక్ష పార్టీలు మంగళవారం సమావేశమై చర్చించాయి. అవిశ్వాస తీర్మాన నోటీస్ ముసాయిదాను సిద్ధం చేసి వాటిపై 50 మంది ఎంపీల సంతకాలను సేకరిస్తున్నాయి. ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా మణిపూర్ హింసపై (Manipur) మాట్లాడేలా ప్రధానిపై ఒత్తిడి తేవాలని విపక్షాలు భావిస్తున్నాయి.
మణిపూర్ పై పార్లమెంట్ లో చర్చ జరిగేందుకు గల పలు మార్గాలను నేతలు పరిశీలించారని, అవిశ్వాసం అనేది అత్యుత్తమ మార్గమని అనుకున్నారని విపక్ష కూటమి వర్గాలు వెల్లడించాయి.ఇవాళ అవిశ్వాస తీర్మానం నోటీస్ (no confidence motion) ఇచ్చే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల కంటే ముందే ఇవ్వాలనేది కూటమి ఆలోచనగా ఉంది. ఉదయం 10.30 గంటలకు పార్లమెంటరీ కార్యాలయంలో హాజరు కావాలని ఎంపీలకు కాంగ్రెస్ విప్ (Congress Whip) జారీ చేసింది. మణిపూర్ పై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పార్లమెంట్ లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని 26 పార్టీల నేతలు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం లోక్ సభలో ఎన్డీఏ కూటమికి 330 మంది సభ్యుల మద్దతు ఉంది.
అయితే I.N.D.I.A కూటమికి 140 మంది సభ్యుల సపోర్టు ఉంది. మరో 60 మంది ఎంపీలు ఏ కూటమిలోనూ లేరు. 2018లో మోదీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీఏకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగి పోయింది.