OYO Pay Cut: లాక్డౌన్ ఎఫెక్ట్, ఉద్యోగుల జీతాల్లో 25 % కోత విధించిన ఓయో సంస్థ, కొంతమందికి 4 నెలల పాటు నిర్భంధ సెలవులు మంజూరు
ఈయన బిజినెస్ కు సాఫ్ట్ బ్యాంక్ లోన్లు మంజూరు చేసింది. భారతదేశంలో ఓయో అనతి కాలంలోనే బాగా ప్రాచుర్యం పొంది యూఎస్ మరియు చైనా దేశాలకు విస్తరించింది.....
New Delhi, April 22: ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఓయో (OYO) - హోటెల్స్ మరియు హాస్పిటాలిటీ చైన్ గ్రూప్, తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల జీతాల్లో 4 నెలల పాటు 25% కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెల మొదలుకొని జూలై వరకు ఈ కోత విధింపు తప్పదని తమ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ లో తెలిపింది. మరికొంత మంది ఉద్యోగులను మే 04 నుంచి ఆగష్టు వరకు 4 నెలల పాటు నిర్భంధ సెలవును మంజూరు చేసింది.
"ఓయో కంపెనీ భారతశంలో ఒక కఠినమైన మరియు అవసరమైన చర్య తీసుకుంటోంది, ఉద్యోగులు తమ వేతనాల్లో 25 శాతం కోతను అంగీకరించాల్సిందిగా కోరుతున్నాము. మరి కొంతమంది ఉద్యోగులు మే 4 నుండి ఆగస్టు వరకు పరిమిత ప్రయోజనాలతో సెలవులో ఉంచబడతారు" అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోహిత్ కపూర్ బుధవారం ఒక నోట్‌లో తెలిపారు.
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమలు చేయబడుతున్న లాక్ డౌన్ కారణంగా చాలా రంగాలు తీవ్రంగా నష్టపోతున్న విషయం తెలిసిందే. చాలా స్టార్టప్ కంపెనీలు మూతబడే పరిస్థితికి వచ్చాయి. ముఖ్యంగా పర్యాటక రంగం, రవాణా రంగం తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి, వీటికి అనుబంధాంగానే పనిచేసే ఓయో చైన్ బిజినెస్ లాక్డౌన్ కారణంగా దెబ్బతింది. అయితే సంస్థకు ఎప్పుడు నష్టం వచ్చినా ఉద్యోగుల పైనే భారం వేసే ఓయో యాజమాన్యం ఈసారి కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుంది. వ్యాపారం దెబ్బతిన్నందున హోటెళ్లకు చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు ఓయో గత నెల మార్చి లోనే తమతో అనుసంధానం చేయబడిన హోటెళ్లకు, గెస్ట్ హౌజ్ లకు తేల్చి చెప్పింది.
ఓయో ఫౌండర్ రితేశ్ అగర్వాల్ (Ritesh Agarwal) డిగ్రీ డ్రాప్-అవుట్. ఈయన బిజినెస్ కు సాఫ్ట్ బ్యాంక్ లోన్లు మంజూరు చేసింది. భారతదేశంలో ఓయో అనతి కాలంలోనే బాగా ప్రాచుర్యం పొంది యూఎస్ మరియు చైనా దేశాలకు విస్తరించింది. దీని ఫౌండర్ రితేష్ అగర్వాల్ రూ. 7,500 కోట్ల నికర లాభంతో అతిపిన్న వయసు గల బిలయనీర్ గా 'Hurun Global Rich List 2020' లో చోటు సంపాదించారు.
అయితే మరోవైపు మాత్రం రితేశ్ మరియు ఓయో బిజినెస్ పై జనంలో ప్రతికూల భావన ప్రచారంలో ఉంది. ఓయో నిర్వహణ, నిబద్ధత మరియు నిజాయితీలపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి ముందుచూపు లేకుండా బిజినెస్ ను విస్తరిస్తూ పోతారు, ఇష్టారీతిన ప్రకటనలకు దుబారా ఖర్చు చేస్తారు. ఈ క్రమంలో నష్టాలు వస్తే వాటిని పూడ్చుకునేందుకు సిబ్బందిని తొలగించడం, హోటెల్ బుకింగ్స్ లో అవినీతికి పాల్పడతారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా నష్టాలు వచ్చినపుడు వేలమంది ఉద్యోగులను ఓయో సంస్థ తొలగించింది. అయినప్పటికీ, ఓయో సంస్థ కోసం ఇప్పటికీ కూడా 10-20 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు సమాచారం.