Panama Papers Scandal: పనామా పేపర్స్ లీక్, 930 సంస్థలకు సంబంధించి రూ. 20,353 కోట్ల నల్లధనం ఖాతాలను గుర్తించినట్లు తెలిపిన కేంద్రం
20,353 కోట్ల నల్లధనంను (Rs 20,353 Crore Undisclosed Credits Detected) గుర్తించినట్లు ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలియజేసింది.
New Delhi, Dec 7: పనామా పేపర్స్, ప్యారడైజ్ పేపర్స్ లీక్‌లలో (Panama Papers Scandal) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 1 నాటికి భారతదేశంలో 930 సంస్థలకు సంబంధించి బహిర్గతం చేయని మొత్తం రూ. 20,353 కోట్ల నల్లధనం ఖాతాలను (Rs 20,353 Crore Undisclosed Credits Detected) గుర్తించినట్లు ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలియజేసింది. శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ, పనామా పేపర్స్ లీక్‌తో ముడిపడి ఉన్న కొన్ని భారతీయ కంపెనీల పేర్లు మీడియాలో విడుదలయ్యాయని, ఇప్పటివరకు పనామా పేపర్స్, ప్యారడైజ్ పేపర్స్ లీక్‌లలో వసూలు చేసిన పన్నులు రూ.153.88 కోట్లు అని తెలిపింది.
ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం.. నల్లధనం విషయంలో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించే వివిధ చట్టాల నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తుల విషయంలో పన్ను శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని వ్రాతపూర్వక సమాధానంలో ఆయన తెలిపారు. నల్లధనం పన్ను చట్టం 2015 కింద బహిర్గతం చేయని విదేశీ ఆదాయం ఆస్తులపై పన్ను విధించడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఇక ప్రత్యక్ష పన్ను చట్టం కింద ఇటువంటి చర్యలు సెర్చ్‌లు, సీజ్‌లు, సర్వేలు, ఎంక్వైరీలు, ఆదాయాన్ని అంచనా వేయడం, తిరిగి మదింపు చేయడం, వడ్డీతో పాటు పన్నులు విధించడం, జరిమానాలు విధించడం, క్రిమినల్ కోర్టులలో ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను దాఖలు చేయడం వంటివి ఉంటాయని ఆయన చెప్పారు.
పనామా ప్యారడైజ్ పేపర్స్ లీక్‌లకు సంబంధించిన 52 కేసుల్లో, నల్లధనం (బహిర్గతం కాని విదేశీ ఆదాయం, ఆస్తులు), ఇంపోజిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్, 2015 కింద క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలు చేయబడ్డాయి. ఇంకా, 130 కేసుల్లో నల్లధనం (బహిర్గతం కాని విదేశీ ఆదాయం మరియు ఆస్తులు), పన్ను చట్టం 2015 కింద చర్యలు ప్రారంభించబడ్డాయి.
ఈ పరిశోధనల్లో భారతీయుల పేర్లు ఉండటంపై, చౌదరి మాట్లాడుతూ.. ప్రభుత్వం అదే విషయాన్ని గుర్తించిందని, సమన్వయంతో, వేగవంతమైన దర్యాప్తు కోసం మల్టీ ఏజెన్సీ గ్రూప్ (MAG) గొడుగు కింద పనామాపేపర్స్ లీక్‌ను తీసుకువచ్చిందని చౌదరి తెలిపారు. MGA CBDT చైర్మన్ కన్వీనర్‌షిప్‌లో, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా మరియు CBDT యొక్క ఫారిన్ టాక్స్ అండ్ టాక్స్ రీసెర్చ్ విభాగం దాని సభ్య ఏజెన్సీలుగా ఏర్పాటు చేయబడింది. దీని దర్యాప్తు పురోగతిలో ఉందని మంత్రి తెలిపారు.