Parliament Budget Session 2024: కాంగ్రెస్ ఔట్‌డేటెడ్.. 40 సీట్లు కూడా రావంటూ ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి వివక్షలేదని వెల్లడి
‘‘కాంగ్రెస్ పార్టీ పదే పదే ఒకే ఉత్పత్తి (రాహుల్‌ను ఉద్దేశిస్తూ)ని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తోంది. అందుకే వారి దుకాణం మూతబడుతోంది. వారు తమ యువరాజును స్టార్టప్‌గా (Congress gave him new startup) తీసుకురావాలని భావిస్తున్నారు. కానీ, ఆయన కనీసం దేన్నీ స్టార్ట్ చేయడు’’ అని ఎద్దేవా చేశారు.
Parliament Budget Session Live Updates: రాజ్యసభలో.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే చివరి సమావేశాలు (Parliament Budget Session 2024) కావడంతో దేశాభివృద్ధి సహా, పొలిటికల్ అంశాలను సైతం టచ్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా పీఎం మోదీ హస్తం పార్టీపై సెటైర్లు ( PM Narendra Modi takes 'Yuvraj' dig at Rahul Gandhi) వేశారు. కాంగ్రెస్ పతనం తనకేమీ ఆనందం ఇవ్వదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని విమర్శల వర్షం కురిపించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ పదే పదే ఒకే ఉత్పత్తి (రాహుల్‌ను ఉద్దేశిస్తూ)ని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తోంది. అందుకే వారి దుకాణం మూతబడుతోంది. వారు తమ యువరాజును స్టార్టప్‌గా (Congress gave him new startup) తీసుకురావాలని భావిస్తున్నారు. కానీ, ఆయన కనీసం దేన్నీ స్టార్ట్ చేయడు’’ అని ఎద్దేవా చేశారు.
లోక్‌సభలో మొన్నీమధ్య కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని మోదీ..తాజాగా మాకు 400 సీట్లు రావాలని ఖర్గే ఆశీర్వదించారు.కానీ, కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు. ఈ విషయాన్ని వాళ్ల మిత్రపక్షంలోని నేత మమతా బెనర్జీనే చెప్పారు. చూస్తుండగానే కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది. కాంగ్రెస్ పతనం నాకేమీ ఆనందం ఇవ్వదు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఆలోచనల్లోనూ కాంగ్రెస్ ఔట్‌డేటెడ్ అయ్యిందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పత్రికా స్వేచ్ఛను కాలరాసింది. అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వాలని ఏనాడూ కాంగ్రెస్ అనుకోలేదు. కానీ, వాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రం భారతరత్న ఇచ్చుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని రాత్రికి రాత్రి కూల్చేసింది. దేశాన్ని విభజించే కుట్ర ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ చేస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణ, ఉత్తరం అంటూ దేశాన్ని రెండు ముక్కలు చేసే యత్నం చేస్తోంది. నా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కొందరు యత్నిస్తున్నారు. నాకు మాట్లాడే అధికారాన్ని ప్రజలు కట్టబెట్టారని మోదీ అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంపై కొందరు అభిప్రాయాలు చెప్పారు. మరికొందరు విమర్శించారు. గతంలో నా ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. వారు నా మాటలు వినేందుకు సిద్ధంగా లేరని తెలుసు. విపక్షాల దుస్థితికి కాంగ్రెస్సే జవాబుదారీ. ఆ పార్టీవన్నీ పనికిరాని ఆలోచనలు. ఉత్తరం, దక్షిణం పేరుతో దేశాన్ని విడదీయాలని చూస్తున్నారు. మన దేశ భూభాగాల్లో చాలా వరకు కాంగ్రెస్ శత్రువులకు అప్పగించింది. మన సైన్యం ఆధునికీకరణను నిలిపివేసింది. అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టింది. అలాంటి కాంగ్రెస్ జాతీయ భద్రత గురించి మాకు పాఠాలు చెబుతోంది’’ అని ప్రధాని మండిపడ్డారు.
పదేళ్లలో ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానానికి తీసుకొచ్చాం. రైతులు, యువత, మహిళలకు మేం ప్రాధాన్యత ఇచ్చాం. జీఎస్టీని సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. ఆర్థిక స్థితిని పురోగతిని ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మనోహ్మన్ సింగ్ కూడా కొనియాడారు. యూపీఏ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయ్యింది. ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ వ్యతిరేకం. కనీసం యుద్ధవీరులను కూడా కాంగ్రెస్ గౌరవించలేదు.. ఒక్క వార్ మెమోరియల్ కూడా కట్టలేకపోయిందని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం పెరిగిపోయింది. కాంగ్రెస్‌ను స్థాపించింది ఓ బ్రిటీషర్. కాంగ్రెస్ భారత సంస్కృతిని అసహ్యించుకుంది. బ్రిటన్ పార్లమెంట్ ఎలా నడిస్తే.. మన పార్లమెంట్‌ను అలా నడిపించారు. విదేశీ వస్తువుల్ని కాంగ్రెస్ స్టేటస్ సింబల్‌గా భావించింది. ఆ బానిసత్వ గుర్తులను మేం చెరిపేస్తున్నాం. కశ్మీర్‌లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు దక్కకపోవడానికి కాంగ్రెస్ కారణం. తాను రిజర్వేషన్లకు వ్యతిరేకమని నెహ్రూ అన్నారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం అన్నారు.
దీనిపై నెహ్రూ ఆనాడు ముఖ్యమంత్రులకు రాసిన లేఖ రికార్డుల్లో ఉంది. ఆర్థికల్ 370ని కాంగ్రెస్ దశాబ్దాలపాటు సాగదీసింది. కావాలనే అట్రాసిటీ యాక్ట్‌లో జమ్ము కశ్మీర్‌ను కాంగ్రెస్ చేర్చలేదు చేర్చలేదు. సీతారాం లాంటి ఓబీసీ నేతను కాంగ్రెస్ అవమానించింది. నెహ్రూ ఘనతను పెంచడం కోసం అంబేద్కర్‌ను శ్యామ్ పిట్రోడా అవమానించారు. గిరిజన రాష్ట్రపతిని కాంగ్రెస్ వ్యతిరేకించి అవమానపర్చింది. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ ఇప్పుడు పాఠాలు చెబుతుండడం విచిత్రంగా ఉందని మోదీ విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్‌లో వారి నాయకులు, విధానాలకే ఎలాంటి గ్యారంటీ లేదు. అలాంటి వారు మోదీ గ్యారంటీలను ప్రశ్నిస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల వారికి కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసింది. మాజీ ప్రధాని నెహ్రూను వారు గుడ్డిగా అనుసరిస్తున్నారు. రిజర్వేషన్లను ఆయన గట్టిగా వ్యతిరేకించారు. మా హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అన్ని పదవుల్లో విశేష ప్రాధాన్యం ఇచ్చాం. తొలిసారి ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసింది ఎన్డీయే ప్రభుత్వం. కాంగ్రెస్ పాలకులు వారి కుటుంబీకులకు మాత్రమే అత్యున్నత పురస్కారాలను అందించారు. 1990లో కేంద్రంలో మా మద్దతుతో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను ‘భారతరత్న’తో సత్కరించింది’’ అని మోదీ గుర్తుచేశారు.
దేశం గొప్పదనం ఢిల్లీలో కాదు.. మారుమూల ప్రాంతంలో ఉందన్న ఆయన.. తమకు అన్ని రాష్ట్రాలు సమానమే అని పేర్కొన్నారు.కరోనా ముందు ప్రపంచం ఓడినప్పటికీ భారత్ గెలిచిందన్నారు. ఇందులో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయన్నారు.ఈ కారణంగానే జీ20 భేటీలను దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించామన్నారు. దేశం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రాలకు కావాల్సినన్ని నిధులు ఇస్తామని, ఫెడరలిజానికి తమ మద్దతు ఉంటుందన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే పనిచేశానని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
నిధులు రావడం లేదని ఢిల్లీలో ఒక రాష్ట్రం ధర్నాకు దిగడం తనకు బాధకలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. తమకు రాష్ట్రాలపై వివక్ష లేదన్నారు. దక్షిణ భారతం కావాలని ధర్నా చేస్తారా? అని ప్రశ్నించారు. ‘బొగ్గు తమ రాష్ట్రంలో ఉంది.. మేమే వాడుకుంటామంటే ఎలా? నదులు మా రాష్ట్రంలో ఉన్నాయి మేమే వాడుకుంటామంటే కుదురుతుందా? మా రాష్ట్రం.. మా ట్యాక్స్ అంటారు.. ఇదక్కడి వితండవాదం. దేశం అంటే దేహం లాంటిది.. అన్ని ప్రాంతాలను సమానంగా చేస్తాం. రాష్ట్రాల హక్కులను అన్నిస్థాయిలో కాపాడుతాం’ అని స్పష్టం చేశారు.