Lok Sabha Security Breach: ఆ ఎంపీ సాయంతోనే పార్లమెంట్ లోపలికి.., కీలక విషయాలు వెలుగులోకి, నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, రంగంలోకి ఫోరెన్సిక్ టీం
రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు.
New Delhi, Dec 13: పార్లమెంట్‌పై దాడి జరిగి నేటికి 22 ఏళ్లు పూర్తయిన వేళ లోక్‌సభలో బుధవారం ఉదయం తీవ్ర భద్రతా వైఫల్యం తలెత్తింది. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు. సభలోకి దూకిన వ్యక్తులు టియర్ గ్యాస్ వదిలారు. దీంతో సీట్లలో ఉన్న ఎంపీలంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. జీరో అవర్ కొనసాగుతుండగా ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు.
సభా కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి గ్యాలరీ నుంచి కిందకు దూకుతూ నినాదాలు చేయగా.. మరోవ్యక్తి ఒకరకమైన పొగను వదలడం కలవరం సృష్టించింది. వారిని ఎంపీలు పట్టుకున్నారు. తర్వాత భద్రతా సిబ్బంది వచ్చి ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమే’అని లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు.
కాళ్లకు వేసుకున్న బూట్లలో టియర్ గ్యాస్ క్యాన్లను దాచుకున్న ఇద్దరు ఆగంతకులు గ్యాలరీలో నుంచి కిందకు దూకిన తర్వాత టియర్ గ్యాస్ వదులుతూ భయ భ్రాంతులు సృష్టించారు. ఇదే సమయంలో పార్లమెంటు బయట మరో ఇద్దరు దుండగులు ఈ తరహాలోనే ఆందోళనలు చేశారు. వీరందర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
లోక్‌సభ లోపల పట్టుబడిన వారు కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ, దేవ్‌రాజ్‌లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ మైసూర్‌కు చెందిన వారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. పార్లమెంటు బయట నిరసన చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. రంగుల పొగను వెదజల్లుతూ ఆందోళనకు దిగిన వీరిద్దరినీ ట్రాన్స్‌పోర్టు భవనం ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్న సాగర్ శర్మ, మనోరంజన్‌లు బెంగళూరు వెళ్తున్నామని చెప్పి మూడు రోజుల కిందట ఇంటి నుంచి ఈ ఇద్దరూ బయల్దేరారు. ఈ ఘటనతో విజిటర్స్ పాస్‌లు స్పీకర్ రద్దు చేశారు.
ఈ ఘటనలో పాల్గొన్న మహిళ హరియాణాలోని హిసార్‌కు చెందిన నీలం (42) కాగా, మరో వ్యక్తి మహారాష్ట్ర లాతూర్‌కు చెందిన అమోల్ శిందే (25)గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. పార్లమెంటు లోపల, వెలుపల జరిగిన ఈ ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దర్యాప్తు చేస్తుందని అధికారులు వెల్లడించారు.
2001లో సరిగ్గా ఇదే రోజున (డిసెంబర్ 13వ తేదీన) లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్ కాంప్లెక్స్‌పై దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 9 మంది అమరులయ్యారు. వారి వర్ధంతి జరుపుకుంటున్న రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ దాడి వెనుక సరైన కారణాలేంటి? ఎవరి హస్తం ఉంది? అనే కోణాల్లో చర్చలు జరుపుకుంటున్నారు.
వీడియో ఇదిగో, పార్లమెంటు భవనం వెలుపల టియర్ గ్యాస్ ప్రయోగించిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఈ ఘటనపై అమ్రోహా ఎంపీ కున్వర్ డానిష్ అలీ మాట్లాడుతూ.. ఎవరైతే ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్‌లో టియర్ గ్యాస్‌తో హడావుడి చేశారో, వాళ్లు బీజేపీ నాయకుడు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా కార్యాలయం ద్వారా పాస్‌లు పొందినట్టు తెలిసిందని పేర్కొన్నారు. దీంతో.. ఈ ఘటన వెనుక బీజేపీ హస్తం ఉండొచ్చన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని పలువురు ఎంపీలు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. లోక్‌సభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నాం. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతాం. ఆ పూర్తి బాధ్యత నాదే. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, నిందితులు వదిలిన గ్యాస్ ఏమిటనే దానిపై సమగ్ర విచారణ జరుపుతాం. దీనిపై ఈ సాయంత్రం సమావేశం (Calls Meeting of MPs To Discuss Security) నిర్వహిస్తాం. సభ్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటాం’’ అని వెల్లడించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే.. సభ సజావుగా నిర్వహించడం మనందరి బాధ్యత అని స్పీకర్ అన్నారు.