PM Modi Full Speech in Loksabha: పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగం, ఏపీ విభజన నుంచి చంద్రయాన్ 3 మిషన్ దాకా...
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పార్లమెంట్ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) లోక్‌సభ (Lok Sabha)లో ప్రసంగించారు.
New Delhi, Sep 18: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పార్లమెంట్ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) లోక్‌సభ (Lok Sabha)లో ప్రసంగించారు.
ఈ చారిత్రక భవనం (Parliament old building) నుంచి మనం వీడ్కోలు తీసుకుంటున్నందుకు కాస్త ఉద్వేగంగా ఉంది. స్వాతంత్ర్యానికి ముందు ఈ భవనం ఇంపీరియల్ లెజిస్లేచర్ కౌన్సిల్‌గా ఉండేది. 75 ఏళ్లలో ఈ భవనం చారిత్రక ఘట్టాలకు వేదికైంది.మనం కొత్త భవనంలోకి వెళ్లినా ఈ భవనం మనకు నిరంతర ప్రేరణగా నిలుస్తుంది. భారత్ సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షి. ఇక్కడ జరిగిన చర్చలు, ప్రణాళికలు భారత గతిని మార్చాయి.
కొత్త పార్లమెంటు భవనానికి తరలి వెళ్లినా పాత పార్లమెంటు భవనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. పాత పార్లమెంట్ భవనంలో జరిగే చివరి సెషన్ చారిత్రాత్మకమైనదని అన్నారు. తాము కొత్త భవనానికి మారడానికి ముందు, ఇక్కడ ఒక చారిత్రాత్మక సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.
భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇది ఒక కీలకమైన ఘట్టమని, ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంటుందని అన్నారు. పాత పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని బ్రిటిష్ వారే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. నిర్మాణానికి దేశవాసులు రక్తం, స్వేదం చిందించారని కొనియాడారు. గత 75 ఏళ్లుగా ఈ భవనంలో అడుగుపెట్టిన ప్రతిఒక్కరూ భారతీయ సంస్కృతిని కాపాడారని ప్రశంసించారు.
ఈ సందర్భంగా మాజీ ప్రధానుల సేవలను మోదీ పేరుపేరునా కొనియాడారు. ఆర్టికల్ 370, జీఎస్‌టీ, ఒకే దేశం - ఒకే పింఛను వంటి కీలక బిల్లులను మోదీ ప్రస్తావించారు. పార్లమెంట్‌లో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగం ఇప్పటికీ ప్రజాప్రతినిధులకు ఎంతగానో స్ఫూర్తినిస్తుందన్నారు. ‘స్ట్రోక్ ఆఫ్ ది మిడ్‌నైట్. ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ.. భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది’ అన్న పండిత్ నెహ్రూ స్వరం మన చెవుల్లో ఇప్పటికీ మార్మోగుతుంది. ‘ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.. ఈ దేశం శాశ్వతం’ అన్న వాజ్‌పేయీ మాటలు నిరంతరం మననంలోకి వస్తుంటాయని గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ ఏర్పాటు గురించి మాట్లాడుతూ..తెలంగాణ (Telangana) ఏర్పాటు ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగింది. కానీ, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదు. వాజ్‌పేయీ హయాంలో మూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరిగింది. ఆ మూడు రాష్ట్రాల విభజన సమయంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదు. ఈ విభజన ఏపీ, తెలంగాణ ఇరు వర్గాలనూ సంతృప్తిపర్చలేకపోయింది. తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగింది. తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయి. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయింది’’ అని మోదీ తెలిపారు.
భారత్ సాధించిన విజయాలపై ప్రపంచం చర్చిస్తోందని, చంద్రయాన్-3 విజయం భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని పునరుద్ఘాటించారు. ఈ పార్లమెంట్ దేశ శాస్త్రవేత్తలను అభినందిస్తుందని అని మోదీ అన్నారు.
ఇటివలే విజయవంతంగా ముగిసిన జీ20 సదస్సుపై ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. జీ20కి అధ్యక్షత వహించడం భారతదేశానికి చెందిన విజయం అవుతుందన్నారు. వ్యక్తులకో లేదా పార్టీలకో అపాదించరాదని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు. భారత్ నేడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోందని, ఇందుకు దేశ సంస్కృతి, వేదాల నుండి వివేకానందుడి వరకు ప్రతిదీ కారణమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
మరోవైపు... దేశం నుంచి తనకు లభిస్తున్న ప్రేమ, గౌరవం చూసి పొంగిపోతున్నానని అన్నారు. దేశం నుంచి ఇంతటి ప్రేమ, గౌరవం లభిస్తాయని తానెప్పుడూ ఊహించలేదన్నారు. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై నిద్రించిన చిన్నారి ఏదో ఒక రోజు పార్లమెంటులో మాట్లాడతాడని ఊహించలేదని తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. అందుకు తాను దేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని అన్నారు.
జీ20 అధ్యక్ష పదవిని విజయవంతం పూర్తిచేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలిపారు. జీ20 సదస్సులో తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని, ప్రపంచానికి కొత్త దిశను ఇస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నాయకత్వంలో సున్నితమైన విషయాలపై కూడా అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారని కితాబిచ్చారు. గత 9 సంవత్సరాలలో ఇండియా ఎలా అభివృద్ధి చెందిందో ఈ పరిణామం తెలియజేస్తోందని అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ప్రారంభోపన్యాసంలో స్పీకర్ ఈ విధంగా స్పందించారు.
రైల్వే ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చిన వ్యక్తి ఈ సభలో అత్యున్నత స్థానం పొందాడు. ఇది భారత ప్రజాస్వామ్య చేతనకు నిదర్శనం. తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా అడుగుపెట్టినప్పుడు ఈ భవనం గడపకు శిరస్సు వంచి నమస్కరించా. ఈ భవనం ఆత్మవిశ్వాసానికి ప్రతీక.భిన్నత్వానికి ప్రతీకైన ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ ఈ భవనం భాగస్వామ్యం కల్పించింది. దళితులు, ఆదివాసీలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలకు ఈ సభ అవకాశం కల్పించింది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఈ సభలో మహిళలు తక్కువ మంది ఉండేవారు. కాలక్రమంలో అది పెరుగుతూ వచ్చింది.
ఈ భవనంలో పనిచేసిన ప్రతిఒక్కరినీ గుర్తించుకోవాల్సిన సమయమిది. ఈ 75 ఏళ్లలో 7500 మంది ప్రజాప్రతినిధులు ఈ సభకు ఎన్నికయ్యారు. 17 మంది స్పీకర్లు పనిచేశారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.ఇంద్రజీత్ గుప్తా 43 ఏళ్లపాటు ఈ సభలో సేవలు అందించి రికార్డు సృష్టించారు. 25 ఏళ్ల చంద్రమణి ముర్ము ఈ సభకు ఎన్నికైన అతిచిన్న వయస్కురాలు. 93 ఏళ్ల వయసులో కూడా షకీ ఉర్ రెహ్మాన్ ఈ సభకు సేవలందించారు.
ప్రపంచంలో బలమైన దేశంగా భారత్ గెలిచి నిలిచింది. ఈ 75 ఏళ్లలో పార్లమెంట్ జనభావనలకు దర్పణం పట్టింది. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు వేదికైంది.నెహ్రూ నుంచి వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్ వరకు ఈ సభకు నేతృత్వం వహించారు. ప్రధానులుగా ఉన్నప్పుడే నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ దివంగతులయ్యారు. చర్చల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్ని ఉన్నా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా నిలిచాయి.
మొరార్జీ దేశాయ్.. వీపీసింగ్, జీవితకాలం కాంగ్రెస్‌లో ఉండి.. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. రాజకీయాలను విరమించుకుని సన్యాసం తీసుకోవాలనుకున్న పీవీ ప్రధానిగా దేశానికి కొత్త దిశానిర్దేశం చేశారు. ఈ పరిణామాలు భారత ప్రజాస్వామ్య విస్తృతికి నిదర్శనం.పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి.. ఈ భవనంపై జరిగింది కాదు.. భారతీయ జీవాత్మపై జరిగిన దాడి. సభ్యులను రక్షించడంలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ల సాహనం జాతి ఉన్నంతకాలం గుర్తుంటుంది.
ఈ సభలో జరిగిన చర్చలు, నిర్ణయాలను ప్రజల ముందుంచిన పాత్రికేయులకూ భారత ప్రజాస్వామ్య విజయంలో భాగస్వామ్యం ఉంది.భారత్ అభివృద్ధి వీచికలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. 75 ఏళ్లలో మనం సాధించింది ప్రపంచాన్ని అబ్బురపర్చింది. చంద్రయాన్-3 విజయం భారత సాంకేతిక, విజ్ఞాన అభివృద్ధికి నిదర్శనం. భారత శాస్త్ర సాంకేతిక నిపుణులకు ఈ భవనం నుంచి శతకోటి వందనాలు సమర్పిస్తున్నా.
జీ20 సదస్సు విజయం ఏ ఒక్క పార్టీదో.. ఒక వర్గానిదో, వ్యక్తిదో కాదు.. యావత్ 140 కోట్ల భారతీయులది. జీ20లో భాగంగా దేశవ్యాప్తంగా జరిగిన వందల సమావేశాలకు అనేక నగరాలు వేదికయ్యాయి.ఈ సదస్సు నిర్వహణ భారత ప్రతిష్ఠను మరింత పెంచింది. మన సామర్థ్యాన్ని, నిర్వహణ కౌశలాన్ని అన్ని దేశాలు ప్రశంసించాయి. జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్‌ను తీసుకోవడం చారిత్రక ఘట్టం. నేడు ప్రపంచానికి భారత్ మిత్రదేశంగా రూపొందింది. భారతీయ విలువలు, ప్రమాణాలతోనే ఇదంతా సాధ్యమైంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)