Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఉభయసభలు వాయిదా, మణిపూర్ హింస, అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్
సెషన్ ఇప్పుడు నవంబర్ 27, బుధవారం తిరిగి సమావేశమవుతుంది.
Parliament Winter Session: విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు సోమవారం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడ్డాయి. సెషన్ ఇప్పుడు నవంబర్ 27, బుధవారం తిరిగి సమావేశమవుతుంది. దిగువ సభ మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమైన వెంటనే ప్రిసైడింగ్ అధికారి సంధ్యా రే లోక్‌సభలో సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేశారు. మణిపూర్ హింస, అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి .
కాగా గత వారం, ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ, మరో ఏడుగురిపై US ప్రాసిక్యూటర్లు, విద్యుత్ సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చే 265 మిలియన్ల స్కీమ్‌లో మోసాలకు పాల్పడ్డారని అభియోగాలు మోపారు. అదానీ గ్రూప్ అన్ని ఆరోపణలను "నిరాధారమైనవి" అని పేర్కొంది. అయితే రేపు సమావేశాలు జరగాల్సి ఉండగా.. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం కావడంతో బుధవారానికి వాయిదా వేశారు.
అదానీ అంశంపై గందరగోళం నెలకొనడంతో రాజ్యసభలో సభా కార్యకలాపాలు కూడా రేపటికి వాయిదా పడ్డాయి. అదానీ గ్రూప్‌పై వచ్చిన లంచం ఆరోపణలపై చర్చ జరగాలని ఎగువ సభలో విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఎగువ సభ మళ్లీ బుధవారం సమావేశం కానుంది. అంతకుముందు రోజు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సంవత్సరం పార్లమెంటు ఎన్నికలలో గెలిచిన ఇద్దరు ఎంపీలతో సహా మృతి చెందిన ఎంపీలకు సభలో నివాళులర్పించిన తర్వాత సెషన్‌ను గంటపాటు వాయిదా వేశారు. విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాల కారణంగా సభ 12 గంటలకు తిరిగి వాయిదా పడింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే X లో ఒక పోస్ట్‌లో మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నందున, ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టను దిగజార్చే అవకాశం ఉన్న అదానీ సాగాపై సవివరంగా చర్చించడం ప్రభుత్వం తీసుకోవాల్సిన మొదటి అడుగు అని అన్నారు.